ప్రభుత్వ అజమాయిషీ కొరవడింది. పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారింది. శాంతిభద్రతల పర్యవేక్షణపై పోలీస్ ఉన్నతాధికారులు శీతకన్ను వేస్తున్నారు. కిందిస్థాయి యంత్రాం గం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. మొత్తంగా తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గాడితప్పింది. అందుకు రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న హత్యలు, దాడులే నిదర్శనం. అవినీతికి పాల్పడుతూ అడ్డంగా పోలీసులు పట్టుబడుతుండటమే సజీవ సాక్ష్యం. నిన్నటివరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో నేడు అశాంతి జ్వాల చెలరేగుతున్నది. ఈ పరిణామాలు రాష్ట్ర ప్రజానీకా న్ని భయపెడుతున్నాయి. ప్రభుత్వ పాలన వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.
Telangana | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలో కొద్ది నెలలుగా చోటుచేసుకుంటున్న వరుస హత్యోదంతాలు ప్రజానీకాన్ని భయానక వాతావరణంలోకి నెడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ చురుకైన కార్యకర్త మల్లేశ్‌యాదవ్‌ను భూతగాదాల ముసుగులో ప్రత్యర్థులు హతమార్చారు. ఈ ఘటన మొదలు రాష్ట్రంలో ఇలాంటి దాడు లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్‌కు చెందిన ఓ కౌ న్సిలర్ నడిరోడ్డుపై ముగ్గురు యువకులపై దా డికి తెగబడ్డాడు. వనపర్తి జిల్లా చిన్నంబావి మం డలం లక్ష్మీపల్లిలో ఆరుబయట నిద్రిస్తున్న బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడిచేసి హత్య చేయడం సంచలనం రేపింది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఓ బీజేపీ నాయకుడు ఇద్దరిని హత్య చేయించారు. తాజాగా భూ తగాదాల నేపథ్యంలో పట్టపగలు ఒకరిపై మూకదాడికి దిగడం గమనార్హం. భూతగాదాలు, ఆర్థిక వ్యవహారాలు అని బయటకు వస్తున్నా, వాస్తవంగా వాటివెనక రాజకీయ కక్షలే ప్రధాన కారణమని తెలుస్తున్నది. భూవివాదం, రాజకీయా ల నేపథ్యంలో జరిగిన దాడిలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడేనికి చెందిన ఈర్య హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నగర పరిధిలోని రాజేంద్రనగర్‌లో కాంగ్రె స్ నాయకుడు సైతం పాతకక్షల నేపథ్యంలో ప బ్లిక్గా హత్యకు గురయ్యారు. ఇవే కాదు.. రాజకీయ నేతలపై, సోషల్‌మీడియాలో పోస్టులను పెడుతున్నవారిపై, జర్నలిస్టులపై, మహిళలపై పలువురు దాడులకు దిగుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ పోకిరీలు, రౌడీలు రెచ్చిపోతూ ప్రజలపై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు.
గాడితప్పిన లా అండ్ ఆర్డర్
రాష్ట్రంలో వెలుగుచూస్తున్న ఘటనలు శాంతిభద్రతల వైఫల్యానికి సజీవసాక్ష్యంగా నిలుస్తున్నాయి. గతంలో ఓఆర్ఆర్పై తాగటం, బాటి ళ్లు విసిరేయడం, బైక్ రేసింగ్‌లు ఉండకపోయే వి. ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద ని ర్మించిన స్టీల్ బ్రిడ్జిపై రాత్రివేళ కొందరు యువకులు కూర్చుని బీర్లు తాగుతూ, బాటిళ్లను అక్క డే పడేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో 500 మీ టర్లకు ఒక పెట్రోలింగ్ వెహికిల్‌లో పోలీసులు కనిపించేవారు. ఇప్పుడు విజిబిలిటీ పోలీసింగ్ ఊసేలేకుండా పోయిందని ప్రజలే విమర్శిస్తున్నారు. గతంలో డయల్ 100 టైం ఇన్సిడెంట్ టైమ్ రీచ్ 7-8 నిమిషాలు ఉండగా, ఇప్పుడు 2 గంటల పైమాటే ఉన్నదని గణాంకాలు చెప్తున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం తో వర్టికల్స్ విధానాన్ని సైతం ఎత్తేశారు. తెలంగాణ పోలీసుల యాప్స్ కూడా పనిచేయని దుస్థితి నెలకొన్నది. అన్నింటికీ ప్రధాన కారణం పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటమే అని స్పష్టంగా తెలిసిపోతున్నది.
అవినీతిలో పోలీస్ యంత్రాంగం
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కిందిస్థాయి పోలీస్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. భూతగాదా కేసును మాఫీ చేసేందుకు రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ కుషాయిగూడ ఇన్స్పెక్టర్, ఎస్సై రెడ్‌హ్యాండెండ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. అంతకుముందు భూవివాదంలో అరెస్టు చేయకుండా ఉండేందుకు లంచం తీసుకుంటూ మాదాపూర్ ఎస్సై, కానిస్టేబుల్ చిక్కారు. వాహన ప్రమాద కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు కోసం డబ్బు లు డిమాండ్ చేసి ఆసిఫాబాద్ మండలంలో ఓ మహిళా ఎస్సై సైతం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూరుస్తూ, పంచాయితీలు, సెటిల్మెంట్లు చేస్తూ శాంతిభద్రతలను గాలికొదిలేశారని అర్థమవుతున్నది. ఈ పరిణామాలే తెలంగాణలో అశాంతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అయినా సర్కారు దృష్టి సారించకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.