హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : దేశంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయడం, చేపల ఉత్పత్తిని పెంచడంతోపాటు మత్స్యకారుల ఆదాయం పెంపుదల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు మత్స్యకారులకు ఇబ్బందికరంగా మారింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధుల ను కేటాయిస్తాయి. దేశవ్యాప్తంగా 2020లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రానికి 2020-21 నుంచి 2024-25 వరకు ఈ స్కీంలో భాగంగా అనేక ప్రాజెక్టులను మంజూరు చేశారు. ఇందులో భాగంగా ఎంపికైన లబ్ధిదారులకు గతంలో కేంద్రం వాటా 60% నిధులు అందాయి. అయితే, రాష్ట్రం చెల్లించాల్సిన 40% వాటాను ఇప్పటికీ విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను గుర్తించిన కేంద్ర మత్స్య శాఖ.. ఈ విధానంలో సమూల మార్పులు చేసి, ‘స్పర్ష్’ విధానం తీసుకొచ్చింది. ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను యూనిట్కి జమచేసిన తర్వాతే.. కేంద్రం తన వాటాను విడుదల చేసి.. డైరెక్టుగా రిజర్వ్ బ్యాంక్ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఈ విధానం కొత్త యూనిట్లకు ప్రయోజనకరంగా ఉంటున్నదే కానీ, పాత యూనిట్లకు చెందిన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటికి సంబంధించిన నిధులపై అధికారులకు, ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడంలేదని మత్స్యకారులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల ప్రాజెక్టు పూర్తయినా, రాష్ట్రం నుంచి రావాల్సిన సబ్సిడీ అందడంలేదని ఆవేదన చెందుతున్నారు.
పీఎంఎంఎస్వై కింద మత్స్యకారులు, చేపల పెంపకందారులు, మత్స్యకార్మికులు, మత్స్య విక్రేతలకు రుణాలను అందించారు. చేపల చెరువుల నిర్మాణం, హ్యాచరీలు, నర్సరీల ఏర్పాటు, కేజ్ కల్చర్, బయోఫ్లాక్, రీసర్క్యూలేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ వంటి ఆధునిక చేపల పెంపకం పద్ధతులతోపాటు ఐస్ప్లాంట్స్, కోల్డ్ స్టోరేజీలు, ట్రాన్స్పోర్టు వాహనాల కొనుగోలు, సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సీఫుడ్ మార్కెటింగ్ కోసం ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం కింద రూ.2 కోట్ల వరకు రుణాలను అందిస్తున్నారు. ఇందుకోసం చేపల పెం పకం ప్రాజెక్టు ఖర్చులో 40% వరకు సబ్సిడీ అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాలకు చెందిన వారికి సీఫుడ్స్కు సంబంధించిన ప్రాజెక్టు ఖర్చులో 60% వరకు సబ్సిడీ లభిస్తున్నది. మంచినీటిలో చేపల హ్యాచరీలు నిర్వహించేవారికి, చేపల చెరువులు నిర్మించేవారికి, చిన్న తరహా దాణా మిల్లులు నెలకొల్పేవారికి సొంత భూమి ఉండాలి. భూమి లేని వారు పదేండ్లకు ఆ భూమిని లీజుకు తీసుకున్నట్టు ధృవపత్రాలు సమర్పించాలి. విక్రయ కేంద్రాల నిర్వహణకు లీజ్ అగ్రిమెంట్ అవసరం. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత జిల్లాలవారీగా యూనిట్లు కేటాయిస్తారు.