హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): బ్యాటరీ వాహనాలు, సోలార్ విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం, కోబాల్డ్, నికెల్ వంటి కీలక ఖనిజాలకు దేశంలో అనూహ్య డిమాండ్ ఏర్పడుతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం అభిప్రాయపడ్డారు. ఈ ఖనిజాల విషయంలో మన దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వరంగ సంస్థలు కృషిచేయాలని ఆయన సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో క్రిటికల్ మినరల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ సదస్సులో సీఎండీ పాల్గొని మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్, సంప్రదాయేతర ఇంధన వనరుల రంగం, విద్యుత్తు వాహనాలు, రక్షణ రంగాల్లో ఈ ఖనిజాల వినియోగం అధికంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 30 రకాల క్రిటికల్ మైనింగ్ (కీలక ఖనిజాల) జాబితాను విడుదల చేసిందని, వీటి ఉత్పత్తిపై దృష్టిసారించాలని కోరారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ బీఎస్ మూర్తి, క్రిటికల్ మినరల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ చైతన్యమయి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.