భద్రాచలం, జూలై 7 : భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూములు ఆంధ్రప్రదేశ్లో ఆక్రమణకు గురవుతున్నాయి. సోమవారం పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు అడ్డుకునేందుకు వెళ్లగా.. స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్థులు తిరగబడ్డారు. తమ భూములు, తమ రాష్ట్రంలోకి రావొద్దు, ఏదైనా ఉంటే కోర్టులోనే తేల్చుకోవాలని గొడవకు దిగారు. దీంతో అధికారులు యటపాక పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి గ్రామస్థులను సముదాయించినా వినకపోగా దేవస్థానం అధికారులను అక్కడ నుంచి వెళ్లాలని నినాదాలు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పక్కనే ఉన్నా పట్టించుకోలేదని భద్రాద్రి దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. ఆలయ ఈవో రమాదేవి అధికారులతో ఫోన్లో మాట్లాడటంతో వారు అక్కడ నుంచి వెనుదిరిగారు. పురుషోత్తపట్నం వాసులు ఆక్రమించుకున్న భూములను తిరిగి అప్పగించాలని దేవస్థానం ఏఈవో రామకృష్ణ, ఈఈ రవీందర్ డిమాండ్ చేశారు.