హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. తమ పోస్టులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్‌తో బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చినట్టు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్(టీజీయూసీటీఏ) రాష్ట్ర నాయకులు ధర్మతేజ, పరశురాం మంగళవారం ప్రకటించారు. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ నుంచి ఈటల, సీపీఐ నుంచి కూనంనేని, సీపీఎం నుంచి జాన్‌వెస్లీ, ఆర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ధర్నాలో పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ నెల 19 నుంచి వర్సిటీల్లో నిరవధిక సమ్మెను ఆయా యూనివర్సిటీ వీసీల దృష్టికి తీసుకెళ్లినట్టు జేఏసీ తెలిపింది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 21 విడుదల చేసిన నేపథ్యంలో తాము నిరసనలకు దిగినట్టు కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ నాయకులు స్పష్టంచేస్తున్నారు. యూనివర్సిటీల్లో నియామకాలకు తాము వ్యతిరేకం కాదంటూనే, తొలుత తమ పోస్టులకు న్యాయం చేసిన తర్వాతే వాటిని చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.