హైదరాబాద్/సూర్యాపేట, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ చౌరస్తా/రామగిరి: క్రమబద్ధీకరణ కోసం గొంతెత్తితే సర్కారు ఉక్కుపాదంతో అణచివేతకు దిగడం దారుణమని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ మండిపడింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం యూనివర్సిటీలు బంద్ పాటించాలని జేఏసీ బంద్‌కు అన్ని వర్సిటీలకు చెందిన విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయని తెలిపారు. వర్సిటీలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం మార్గదర్శకాల పేరుతో ప్రభుత్వం దొడ్డి దారిలో జీవో 21 జారీ చేసిందని మండిపడ్డారు.
అడుగడుగునా అరెస్టులు… నిర్బంధాలు
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ అధ్యాపకుల జేఏసీ పిలుపునిచ్చిన ‘చలో హైదరాబాద్’ ఉద్రిక్తంగా మారింది. బుధవారం అసిస్టెంట్ ప్రొఫెసర్లు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టుచేసి, 15 పోలీస్స్టేషన్లకు తరలించారు. అలాగే జేఏసీ నేతలు, అధ్యాపకులను మంగళవారం అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టు, గృహనిర్బంధం చేశారు. హైదరాబాద్‌కు బయల్దేరిన కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండలో మహాత్మాగాంధీ వర్సిటీ అధ్యాపకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిని జేఏసీ నేతలు బైరి నిరంజన్, కరుణాకర్‌రావు, రాజేశ్, జితేందర్‌రెడ్డి, శ్రీధర్ ఖండించారు. అధ్యాపకులను క్రమబద్ధ్దీకరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు మాటతప్పడం దారుణమని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ప్రజాఉద్యమం తప్పదు
ప్రజాపాలన అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రిన్సిపాళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా వదలడం లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ విమర్శించారు. డిమాండ్ల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్ధరాత్రి అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. ఇలాగే అరెస్టులు చేస్తూ పోతే ప్రజాఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీనే అమలు చేయాలని కోరితే నిర్బంధించడమేంటని ప్రశ్నించారు. అటు.. కాంట్రాక్ట్ అధ్యాపకుల డిమాండ్లపై ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు గురువారం ఉన్నత విద్యామండలి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నిరసిస్తే అరెస్టులా?
కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్టులను క్రమబద్ధీకరించాలి. జేఎల్, డీఎల్‌ల పోస్టులను రెగ్యులరైజ్ చేసినప్పుడు మా పోస్టులను ఎందుకు రెగ్యులర్ చేయలేకపోతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం ఏంటి?
– బైరి నిరంజన్, కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ రాష్ట్ర నాయకుడు
బీఆర్ఎస్ సర్కార్ రెగ్యులరైజ్ చేసింది
కేసీఆర్ హయాంలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లను క్రమబద్ధీకరించారు. అప్పుడు అడ్డురాని నిబంధనలు ఇప్పుడెలా అడ్డువస్తున్నాయి? మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడుతున్నది. మాకు న్యాయం జరిగే వరకు విడిచిపెట్టే ప్రసక్తేలేదు.
-పరుశురామ్, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్
నక్క పంది ఓ అడవి!
అక్కడేదో కలకలం
దేశమంతా ఒక్కసారిగా
అటుగా చూపు నిలిపెను!
వీరు అక్కడ నక్కలున్నాయనిరి
వారు కాదు
అక్కడ పందులున్నాయనిరి
అది విన్న అడవి పొడిగా నవ్వి
అన్ని జీవులకు వాసం నా ఒడియె అనెను!
రెచ్చిపోయిన స్వరముతో వీరు
వారిని అక్కడ అడవి ఎక్కడిదనిరి?!
కళ్ళు ఆకుపచ్చగా చేసి అడవి
గుడ్డివాడా!
మీరు లోలోన దాచుకున్న
నల్ల ధనము కాదు నేను
ఆకాశమెత్తు ఎదిగిన
నిలువెత్తు హరిత సౌందర్యమే నేను!
అంతలో అల్లంత దూరంలో
పక్షుల కలకలారవాలు
జంతువుల ఆహాకారాలు
కోరలు నూరుతున్న బుల్డోజర్లు!
శ్వాస ఆగిన రీతి ఒకరు
రక్తముడికిన తీరు మరొకరు
మాటల కత్తులకు కొదవేలేదు
ఎరుపెక్కెను నలు దిక్కులు!
ఇంతలో వాదోపవాదాల నడుమ
ఒక్కసారిగా ధర్మదేవత కళ్ళు తెరిచెను
ఎక్కడి దొంగలు
అక్కడే గప్‌చుప్!
ఓ నల్ల కుక్కా!
నక్కలు పందులు ఒంటి కాళ్ల మీద లేచెను
ఢిల్లీ ఆగ మేఘాల మీద
యుద్ధక్షేత్రమున మొలిచెన్!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261