నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 10: కాంట్రాక్టు అధ్యాపకుల అక్రమ అరెస్టులకు నిరసనగా కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ పిలుపుమేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన యూనివర్సిటీల బంద్ విజయవంతమైంది. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, అంబేద్కర్ విశ్వవిద్యాలయాలు నిరసనలతో హోరెత్తాయి. ఉదయం నుంచి జేఏసీ నాయకులు ర్యాలీలు తీశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. ‘అక్రమ అరెస్టులు సిగ్గు సిగ్గు.. వుయ్ వాంట్ జస్టిస్.. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం’ అని నినదించారు. జీవో-21ను రద్దు చేయాలని బాసర ట్రిపుల్ ఐటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆర్జీయూకేటీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు.
కూకట్పల్లి జేఎన్టీయూహెచ్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు బహిష్కరించారు. అనంతరం వర్సిటీ వైస్ చాన్స్‌లర్ టీ కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ జీవీ నరసింహారెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. ఖమ్మం వర్సిటీ పీజీ, వ్యాయామ కళాశాలల ఎదుట ధర్నా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జేఎన్టీయూల్లో తరగతులు బహిష్కరించి పోలీసుల తీరును ఖండించారు. పాలమూరు వర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ వర్సిటీ సౌత్ క్యాంపస్‌లో బంద్ పాటించారు. అధ్యాపకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ నాయకులు బైరి నిరంజన్, పరశురాం, జితేందర్‌రెడ్డి, శ్రీధర్లోథ్, రాజేశ్, ధర్మతేజ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలిపిన మహిళా అధ్యాపకులపై పోలీసుల దాష్టీకానికి నిరసనగా చేపట్టిన బంద్ జయప్రదమైనట్టు తెలిపారు.
ఇందుకు సహకరించిన విద్యార్థి, ఉద్యోగ, పరిశోధక సంఘాల బాధ్యులు, తమ ఆవేదనను సమాజానికి చూపిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. పదేండ్ల సర్వీసు పూర్తిచేసిన వారిని రెగ్యులరైజ్ చేయాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1,270 మంది ఒప్పంద అధ్యాపకులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నదని ధ్వజమెత్తారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగిన కాంట్రాక్టు అధ్యాపకులపై పోలీసులతో దాడి చేయించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించే దాకా పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.