హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సమాజాభివృద్ధికి విద్యకు అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యమిచ్చి బలోపేతం చేయాలని కోరారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. మూర్తి, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, పీడీఎస్యూ (జార్జిరెడ్డి) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వర్రావు, పీడీఎస్యూ (విజృంభణ)రాష్ట్ర కార్యదర్శి విజయ్ పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కేంద్రం రైతువ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 13న ఇందిరాపార్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఎక్కేఎం కన్వీనర్లు సాగర్, పద్మ, వెంకటయ్య వెల్లడించారు. ఈనెల 12 వరకు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర రైతు సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతువ్యతిరేక విధానాలపై పార్లమెంట్లో ఒత్తిడి చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తామని పేర్కొన్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఎంసీలలో ఆధునిక నదుపాయాలు కల్పించడంతోపాటు గిడ్డంగులను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యస్కేయం నాయకులు జ్వాలా వెంకటేశ్వర్లు, మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.