హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు మరింత బలోపేతం కావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవి అన్నారు. టీఎస్ యూటీఎఫ్ 11వ ఆవిర్భావ దినోత్సవం శనివారం హైదరాబాద్ దోమలగూడలోని సంఘం కార్యాలయంలో నిర్వహించారు. సంఘం పతాకాన్ని జంగయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూటీఎఫ్ రాష్ట్ర విభజనతో టీఎస్యూటీఎఫ్గా ఆవిర్భవించిందని తెలిపారు. రాష్ట్రంలో ఐక్య ఉద్యమాల నిర్మాణంలో టీఎస్ యూటీఎఫ్ చురుకుగా వ్యవహరించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్త మోతుకూరి నరహరి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సింహాచలం, నేతలు మాణిక్‌రెడ్డి, మస్తాన్‌రావు, రాజారావు, శారద, బుచ్చిరెడ్డి, రామకృష్ణ, భాషా తదితరులు పాల్గొన్నారు.