హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) మరో మైలురాయిని అధిగమించింది. శనివారం ఆ ప్లాంట్‌లోని యూనిట్-1 కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీవోడీ) సక్సెస్ అయ్యింది. 800 మెగావాట్ల సామర్థ్య కలిగిన ఈ యూనిట్ ఎలాంటి సమస్యలు, అటంకాలు లేకుండా పూర్తిలోడ్తో నిర్విరామంగా నడిచింది. 72 గంటల్లో 57.60 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా.. గంటన్నర ముందే నిర్దేశిత లక్ష్యాన్ని చేరింది. కనిష్ఠంగా 814 మెగావాట్లు, గరిష్ఠంగా 828 మెగావాట్ల లోడ్‌తో నడిపారు. వైటీపీఎస్‌లోని మొత్తం 5 యూనిట్లలో ఇప్పటికే యూనిట్-2లో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. తాజాగా యూనిట్-1లో సీవోడీ పూర్తికావడంతో పూర్తిస్థాయి విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఏర్పడింది. మిగిలిన 3 యూనిట్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని టీజీజెన్కో అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
సరిపడా బొగ్గు అందేనా?
వైటీపీఎస్‌లోని అన్ని యూనిట్లు అందుబాటులోకి వచ్చేనాటికి సరిపడినంత బొగ్గు అందుతుందా? లేదా? అనే అనుమానాలు పట్టిపీడిస్తున్నాయి. ఈ ప్లాంట్‌లోని 5 యూనిట్లు పూర్తిస్థాయిలో నడవాలంటే రోజుకు 50వేల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. ఆ లెక్కన రోజుకు 12-14 రైల్వేరేకుల బొగ్గును సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం సింగరేణి సంస్థ రోజుకు 4రేకుల బొగ్గును మాత్రమే సరఫరా చేస్తున్నది. డిసెంబర్ కల్లా రోజుకు 12-14 రేకుల బొగ్గు వైటీపీఎస్‌కు చేరితేనే మొత్తం 5యూనిట్లు నడుస్తాయి. అంత బొగ్గును సింగరేణి సరఫరా చేయగలదా అని అనుమానాలు వ్యక్తమవుతుండటంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు.