హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): నిర్దేశిత గడువు దాటి ఏండ్లు గడుస్తున్నా దేవాదుల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదంటూ తెలంగాణ అధికారులపై కేంద్ర జల్‌శక్తిశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రాజెక్టు పనుల పూర్తిపై ఇంత నిర్లక్ష్యమా అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏఐబీపీ (ఆక్సిలేటరీ ఇరిగేటెడ్ బెనిఫిట్ ప్రోగ్రామ్) స్కీమ్ పరిధిలోని తెలంగాణ ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి కాంతారావు శుక్రవారం ఢిల్లీలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్‌శాఖ సెక్రటరీ శ్రీధర్, ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏఐబీపీ పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిని వివరించగా.. కేంద్ర జలశక్తి అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. వాస్తవంగా గత ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ప్రగతి’ సమీక్షలోనే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తమైంది. ఇప్పటికీ ఆయా ప్రాజెక్టుల్లో ఎలాంటి పురోగతిని సాధించకపోవడంపై తాజా సమావేశంలో మరింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
‘తమ్మిడిహట్టి’పై సమగ్ర అధ్యయనం మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని, ఆ దిశగా సమగ్ర అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ బరాజ్ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు పూర్తిస్థాయిలో సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ ప్రతినిధులకు ఆదేశించారు. తమ్మిడిహట్టి బరాజ్‌కు సంబంధించిన అంశాలపై శుక్రవారం ఆయన బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు.