హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తేతెలంగాణ): గ్రామీణ జీవనోపాధి బలోపేతంలో పశుసంపద, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తాయని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమలశాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆహారభద్రత కల్పించేందుకు ఈ రంగాలు ఎంతో దోహదం చేస్తున్నాయని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో కాంపౌం డ్ లైవ్‌స్టాక్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎల్ఎఫ్ఎంఏ-క్లాఫ్మా) 58వ వార్షిక సమావేశం, 66వ జాతీయ సింపోజియం జరిగింది.
ఈ సందర్భంగా ‘దేశ వ్యవసాయంలో పాడిపశువులు- భవిష్యత్ మార్గం’ అనే అంశంపై నిపుణులు, శాస్త్రవేత్తలు హాజరై చర్చించారు. ఈ సందర్భంగా సావనీర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్(ఎన్ఎల్ఎం)జాయింట్ సెక్రటరీ ముత్తుకుమారస్వామి, క్లాఫ్మా ఆఫ్ ఇండియా చైర్మన్ దివ్యకుమార్ గులాటి తదితరులు పాల్గొన్నారు.