రాష్ట్రంలోని ఆనకట్టల భద్రతను రేవంత్ ప్రభుత్వం గాలికొదిలేయడంపై కేంద్రం మండి పడింది. రాష్ట్రంలో మొత్తం 173 ఎన్డీఎస్ఏ నిర్దేశిత డ్యామ్‌లు ఉండగా.. వాటిలో నాలుగోవంతు వాటిని కూడా ప్రభుత్వం సమగ్ర మూల్యాంకనం చేయక పోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. 15 నెలల్లో ప్రక్రియను పూర్తిచేయాలంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేరుగా తనకే లేఖ రాయడంతో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. మంగళవారం అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆనకట్టల భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని, జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆనకట్టల భద్రతపై ఇకనైనా దృష్టి సారించాలని, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి 10 రోజుల క్రితమే ప్రత్యేకంగా లేఖ రాశారు. ఎన్డీఎస్ఏ-2021 ప్రకారం విస్తీర్ణం, ఎత్తు, నీటినిల్వ పరిమాణం, ఆయకట్టు తదితర అంశాల ఆధారంగా డ్యామ్‌లను విభజించారు. ఇలా నిర్ధారించిన ఆనకట్టల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏలోని సెక్షన్ 38(1) ప్రకారం సమగ్ర మూల్యాంకనం నిర్వహించాలి. అందుకు కోసం స్వతంత్ర నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలి. ఆనకట్ట నిర్మాణాత్మక, కార్యాచరణ స్థితిని అంచనా వేయడమే దీని లక్ష్యం.
ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఐదేండ్లలోగా నిర్దేశిత డ్యామ్‌ల భద్రతపై సమగ్ర మూల్యాంకనం (సీడీఎస్ఈ) పూర్తి చేయాలి. ఆ తర్వాత ఏటా క్రమం తప్పకుండా మూల్యాంకనం నిర్వహించాలి. ఎన్డీఎస్ఏ-2021 ప్రకారం 2026 డిసెంబర్‌లోగా సీడీఎస్ఈ పూర్తి చేయాల్సి ఉండటంతో ఈ విషయమై ఇటీవల కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రత్యేకంగా సమీక్ష జరిపింది. సీడీఎస్ఈ నిర్వహణలో తెలంగాణ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఈ సమీక్షలో గుర్తించింది. ఎన్డీఎస్ఏ నిర్దేశించిన డ్యామ్‌లు తెలంగాణలో 173 ఉన్నాయి. ఇప్పటికీ వాటిలో పావువంతు డ్యామ్‌ల సీడీఎస్ఈ కూడా పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఘాటుగా స్పందించారు. నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రికే ప్రత్యేకంగా లేఖ రాశారు. వచ్చే 15 నెలల్లోగా ప్రతి ఆనకట్టకు సీడీఎస్ఈ పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకోసం సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్థిక వనరులను ఉపయోగించుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని, అవసరమైతే ఎన్డీఎస్ఏ సహకారం తీసుకోవాలని సూచించారు. అందులో భాగంగా సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలని, సీడీఎస్ఈ పూర్తికి దిశానిర్దేశం చేయాలని స్పష్టం చేశారు. దీంతో ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.