భూపాలపల్లి టౌన్, జూలై 30: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పర్యటన చప్పగా సాగింది. వరదతో తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామంలో ఆదివారం కిషన్రెడ్డి పర్యటించారు. రెండు వాడల్లోనే తిరిగి మీడియాతో మాట్లాడి, వెళ్లిపోయారు. గ్రామాభివృద్ధికి, ముంపునకు గురైన బాధితులకు ఎలాంటి నిధులు ప్రకటించలేదు. కేంద్ర మంత్రి వస్తున్నారంటే తక్షణ సహాయం తప్పకుండా అందుతుందని గ్రామస్థులు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు.
అయితే, గ్రామ అభివృద్ధికి గానీ, తక్షణ అవసరాలకు గానీ ఎలాంటి సాయం ప్రకటించలేదు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించి వరదలతో నష్టపోయిన వారి ఊసే మరిచిపోయారు. ఇదిలా ఉండగా తమ వాడల్లో కేంద్రమంత్రి ఎందుకు తిరగలేదని గ్రామస్థులు మండిపడ్డారు. గ్రామానికి చెందిన బీజేపీ నేత రఘునాథరెడ్డిని నిలదీశారు. వెంటనే గ్రామాన్ని ఖాళీ చేయించి మరో చోట ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే గ్రామాన్ని ఖాళీ చేయించి మరో చోట ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కిషన్రెడ్డి జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రాను కోరారు.