హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ తీరు మసిపూసి మారేడు కాయ చేసిన చందంగా ఉన్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 400కు పైగా హామీలు, 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని, ఏ ఒక హామీనీ చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలు వేసి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు.