హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ‘నేను సీఎం రేవంత్రెడ్డి మాదిరిగా పార్టీలు మార్చలేదు. ఒకే పార్టీలో కొనసాగుతున్న’ అని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘కేంద్రం ధాన్యం ఎలా కొనదో చూసుకుందాం.. కొనకుంటే కిషన్రెడ్డి పొలిమేర్లు కూడా దాటవ్’ అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కిషన్రెడ్డి అంతే గట్టిగా స్పందించారు. ‘నన్ను పొలిమేర దాటకుండా ఆపేవాడింకా పుట్టలేదు.. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాను’ అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తాను ఎవరికీ భయపడబోనని, ఎవరికీ తలవంచబోనని స్పష్టంచేశారు. రెచ్చగొడితే రెచ్చిపోయే వ్యక్తిని కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. తన ఇంటి ముందు ధర్నా చేస్తానంటే భయపడనని, దేనికైనా సిద్ధమేనని తెలిపారు. ‘మీకు ఎంతోకాలం లేదు. ఇంకో రెండున్నరేండ్లే సమయం ఉన్నది. దళితులు, బీసీలు మీ ఇంటి ముందు ధర్నాలు చేసే రోజులు ముందున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ, చేతలు సచివాలయమే దాటడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి రాజకీయపరమైన నిరాశ, నిస్పృహలో ఉన్నట్టు అర్థమవుతున్నదని పేర్కొన్నారు.