Allu Arjun Arrest | సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. జాతీయ అవార్డు గ్రహిత అల్లు అర్జున్ను అరెస్టు చేసిన తీరు సరైనది కాదని మండిపడ్డారు. నేరుగా బెడ్రూంలోకి వచ్చి అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారని బండి సంజయ్ తెలిపారు. అలాంటి వ్యక్తితో కాస్త మర్యాదగా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడ్డారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం నిజంగా విచారకరమని తెలిపారు. కానీ ఆ తొక్కిసలాట పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని ఆరోపించారు. పుష్ప ది రైజ్ ఘన విజయం తర్వాత పుష్ప 2కి విపరీతమైన క్రేజ్ వచ్చిందని.. ఆ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయని బండి సంజయ్ తెలిపారు. అలాంటి సమయంలో ఏర్పాటు చేసిన ఈవెంట్కు సరైన ఏర్పాట్లు చేయకపోవడం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని చెప్పారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను నేరస్తుడిగా చూడొద్దని.. ఆయనకు కనీస గౌరవం ఇవ్వాలని హితవు పలికారు.
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ను ఇవాళ మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సుమారు రెండు గంటల పాటు అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. బన్నీ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం చిక్కడపల్లి పీఎస్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీని తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. కాగా, అల్లు అర్జున్ అంశంలో చట్ట ప్రకారం ఫాలో అవుతున్నామని పోలీసులు తెలిపారు.