హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : జనగణనతోపాటు కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, ఓబీసీ వర్గాల నేతలు స్వాగతించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షనీయమని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఇది బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితమని, బీసీల విజయమని చెప్పారు.
జనగణనలో కులగణన చేయాలని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, మాజీ సభ్యులు కిశోర్‌గౌడ్, ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ గుర్తుచేశారు. చట్టసభలలో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కూడా కేసీఆర్ హయాంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇది తరతరాలుగా ఎదురుచూస్తున్న బీసీ మహాజనావళి ఆకాంక్షల విజయమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు.