హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తేతెలంగాణ): ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన విధి విధానాలు జిల్లాలకు అందకపోవడంతో వాటి పంపిణీ కోసం మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. నిధులు మంజూరు చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం చెరువులకు ఎన్ని లక్షల చేప పిల్లలు ఇస్తుందనే విషయాన్ని అంచనా వేయలేకపోతున్నది. చేప పిల్లలను సకాలంలో చెరువులు, కుంటల్లో వదలకుంటే అవి ఆశించిన మేర పెరగవని అంటున్నారు.
నిరుడు కూడా సీజన్‌కు అనుగుణంగా చేప పిల్లలు పూర్తిస్థాయిలో అన్ని సొసైటీలకు అందలేదని మత్స్యకారులు చెప్తున్నారు. సీజన్లో కీలకమైన ఆగస్టు నెల ఇప్పటికే ముగియడంతో వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియను పూర్తిచేసి చేప పిల్లలను అందించాలని మత్స్య సహకార సొసైటీలు కోరుతున్నాయి. నాణ్యమైన చేప పిల్లలను మత్స్యకారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా మత్స్యశాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చేప పిల్లలు, ధరల గురించి తెలుసుకుంటారు. ఈ ఏడాది ఇప్పటికే ఆ పని జరగాల్సి ఉన్నా ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేయడంతో అధికారులు ఇప్పుడు రంగంలోకి దిగారు.
ఈ ఏడాది రూ.122 కోట్లతో రాష్ట్రంలోని 46 వేల చెరువులు, కుంటలకు చేపలు, రొయ్యలను పంపిణీ చేయనున్నటు ప్రభు త్వం ప్రకటించింది. ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం టెండర్లు స్వీకరిస్తున్నది. ఈ ప్రక్రియ 8తో ముగియనుంది. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే మత్స్య సొసైటీలకు ఎంత మేరకు చేప పిల్లలు ఇవ్వాలనే ప్రణాళికలు రూపొందించుకొని పంపిణీకి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.