హైదరాబాద్, ఆగస్టు 12, (నమస్తే తెలంగాణ)/హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ): ‘మీరు 60 ఏండ్ల వయసులో కూడా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకోవచ్చు. కానీ, 30 ఏండ్ల వయసున్న మేము మాత్రం ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి పనికిరామా?’ ఇదీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరుద్యోగుల నుంచి ఎదురైన పదునైన ప్రశ్న. తమ ప్రశ్నలతో ఆయనను పరుగులు తీసేలా చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మెల్సీ, టీజేఎస్ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాంకు ఊహించనిరీతిలో ఈ చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ‘ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితి పెంపు’ అన్న అంశంపై జరిగే సెమినార్లో మాట్లాడేందుకు వచ్చిన ఆయన్ను నిరుద్యోగ యువత ఒకసారిగా అడ్డుకొని చుట్టుముట్టింది. పెద్ద సంఖ్యలో అకడికి చేరుకొన్న నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రెస్‌క్లబ్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
ఆయన వచ్చీరాగానే ఎదురెల్లిన నిరుద్యోగులు అడ్డుకొని ప్రశ్నల వర్షం కురిపించారు. తమ హక్కుల సంగతేంది అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలపై ఇప్పు డు ఎందుకు మాట్లాడటం లేదని వెంటపడటంతో ఒక్కసారిగా కోదండరాం కంగుతిన్నా రు. ‘ఎమ్మెల్సీవై ఏం ఒరగబెట్టావ్? మీరు రాజీనామా చేయండి.

మీరు చెప్పారనే నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం. ఎన్నికల ముందు మీరు మా ఇండ్లకు వచ్చి మద్దతు అడిగారా? లేదా? మాతో బస్సు యాత్రలకు జెండాలు ఊపించారు కదా! అప్పుడు మా ఉద్యోగాల కోసం ఎగిరెగిరి గొంతెత్తారు. ఇప్పుడు ఏమైం ది మీ గొంతుకు? మేం ఎందుకు గుర్తుకు రావ డం లేదు? మా ఉద్యోగాల నోటిఫికేషన్‌పై ఎం దుకు మాట్లాడటం లేదు? నిరుద్యోగుల సమస్యలపై మౌనమెందుకు? సీఎం రేవంత్‌రెడ్డి అంటే భయమా?’ అంటూ కోదండరాంను ని రుద్యోగుల ప్రశ్నలతో కడిగిపారేశారు.
ఈ ప్రశ్న ల పరంపరతో కోదండరాం నీళ్లు నమిలారు. ‘ఇది సమయం కాదు. నాకు ఇంపార్టెంట్ ప్రెస్‌మీట్ ఉన్నది’ అంటూ సమాధానం చెప్పకుం డా అక్కడి నుంచి ఉడాయించేందుకు య త్నించారు. నిరుద్యోగుల ఆవేదనతో కూడిన ప్రశ్నలకు ఆయన బదుల్విలేకపోయారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారికి సమాధానం చెప్పలేక, స్పష్టమైన హామీ ఇవ్వలేక మౌనంవహిస్తూ సెమినార్లో పాల్గొనకుండానే అకడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈలోగా పోలీసులు రంగప్రవేశం చేసి నిరుద్యోగులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో నిరుద్యోగులు, పోలీసుల మధ్య తోపులాట జరుగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పలువురు నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు.
గత శాసనసభ ఎన్నికల సమయంలో మీరిచ్చిన పిలుపును నమ్మి తామంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించామని నిరుద్యోగులు కోదండరాంకు గుర్తుచేశారు. ‘మీ మాటలు నమ్మి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తే, ఇప్పుడు ఆ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరెందుకు మౌనంగా ఉన్నారు?’ అంటూ నిలదీశారు. తమ సమస్యలను మీడియా కూడా సరిగా కవర్ చేయడం లేదని, నిరుద్యోగుల గోడు ప్రభుత్వం వరకు చేర్చేలా మీడియాకు స్పష్టంగా చెప్పాలని కోదండరాంను డిమాండ్ చేశారు. ఉద్యోగ వయోపరిమితి పెంపు విషయంలో తమ భవిష్యత్తు నాశనమవుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ఆయనను నిలదీశారు.