ముదిగొండ, ఆగస్టు 1 : కాంగ్రెస్ సర్కార్ గ్రూప్స్, ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఓ నిరుద్యోగి మనస్తాపం చెందాడు. ఎన్నేండ్లు చదివినా ఉద్యోగం వస్తుందో, రాదోనని తీవ్ర కలత చెంది ఎలుకల మందు, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్ పీజీ వరకు చదివాడు. ముత్తారం శివారు పల్లె చెరువులోని మిషన్ భగీరథ ప్లాంట్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
శనివారం విధులకు వెళ్లిన ఆయన, సాయంత్రం నిరుద్యోగుల వాట్సాప్ గ్రూపులో సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. ఆ తర్వాత ఎలుకల మందు, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ విషయాన్ని అతని మిత్రులు వేణుకుమార్ తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో అతని తండ్రి ప్లాంట్ వద్దకు చేరుకొని పరిశీలించగా వేణుకుమార్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. చుట్టూ పరిశీలించగా ఎలుకల మందు, నిద్రమాత్రల ప్యాకెట్లు కనిపించాయి. చికిత్స నిమిత్తం అతనిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతానికి వేణుకుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
‘నా మరణానికి కారణం సరైన సమయానికి గ్రూప్స్ నోటిఫికేషన్లు రాకపోవడమే. ఐదేండ్లుగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ఒక్కసారి మాత్రమే పరీక్ష రాశాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జూన్ 2 సందర్భంగా చిన్న చిన్న నోటిఫికేషన్లు ఇస్తున్నారు తప్ప గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనిపించలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టడంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు.
ఐదేండ్లుగా గ్రూప్స్ ముసుగులో మునిగిపోయా. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే ఏదో ఒక జాబ్ వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభ్యర్థులు వారి జీవితకాలంలో 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఒకటి లేదా రెండు నోటిఫికేషన్లు మాత్రమే చూస్తున్నారు. ఇటీవల విడుదలైన పోలీస్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కూడా నిరుద్యోగులను సంతృప్తి పరచలేదు. మా అమ్మ మానసిక వికలాంగురాలు. మాకు సొంత ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. పదేండ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఈ నోట్ సీఎం, డిప్యూటీ సీఎం రేవంత్, రాహుల్‌గాంధీకి చేరే వరకూ షేర్ చేయండి’ అంటూ వేణుకుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.