ఎల్బీనగర్, సెప్టెంబర్ 12 : రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ల సాధన కోసం ఈనెల 15 నుంచి దిల్‌సుఖ్‌నగర్‌లోని తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్టు తెలంగాణ నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్‌కుమార్ తెలిపారు. నిరాహార దీక్షకు మద్దతు కూడగట్టేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, విద్యావేత్తలను కలుస్తున్నట్టు తెలిపారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలన్న డిమాండ్‌తో ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లో నిరుద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్‌కుమార్ మరో ముందడుగు వేసి ఆమరణ నిరాహార దీక్షకు నిర్ణయించారు. ఈసారి నోటిఫికేషన్ వచ్చేదాకా దీక్ష విరమించబోనని స్పష్టంచేశారు.
రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య , బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, ఎంపీ ఈటల రాజేందర్, విద్యావేత్త ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఉద్యమకారుడు పృథ్వీరాజ్ యాదవ్, ప్రసన్న హరికృష్ణను కలవగా వారంతా సంపూర్ణ మద్దతు తెలిపారు. తమ పోరాటానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి కోరనున్నట్టు అశోక్‌కుమార్ చెప్పారు. హైకోర్టు తీర్పు ప్రకారం గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ తిరిగి నిర్వహించి తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలేదని, నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.