కవాడిగూడ, ఫిబ్రవరి 4 : రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపిస్తున్నదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతామని స్పష్టంచేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ తెలంగాణ నేత ఇంద్రనాయక్ ఆధ్వర్యంలో ‘హలో నిరుద్యోగి.. చలో ఇందిరాపార్క్’ పేరుతో బుధవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త అశోక్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీ, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్, ప్రసన్న హరికృష్ణలు పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి రాజకీయ నిరుద్యోగులపై ఉన్న ప్రేమ.. నిరుద్యోగ విద్యార్థులపై లేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 70వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు గొప్పలు చెప్పుకొంటున్నారని.. గత బీఆర్ఎస్ హయాంలో కల్పించిన ఉద్యోగాలు కూడా తామే ఇచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
నిజంగా కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో అశోక్‌నగర్ చౌరస్తాలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో తెలంగాణ నిరుద్యోగ యువత కీలకపాత్ర పోషించిందని వారు గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన, గ్లోబల్ సమ్మిట్, హార్వర్డ్ యూనివర్సిటీలో చదువు పేరుతో రూ.లక్షల కోట్లు వృథా చేశారని విమర్శించారు. అవే డబ్బులు నిరుద్యోగ యువతకు కేటాయిస్తే ఉపాధి పొందేవారమని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ తరహాలోనే డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, బీఈడీ వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పించాలని, మెగా డీఎస్సీ వేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి, నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని.. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రనాయక్, శంకర్‌నాయక్, లక్ష్మణ్‌లు మాట్లాడుతూ ఓడియన్ మాల్‌ను ప్రారంభించేందుకు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌కు వచ్చిన సీఎం రేవంత్.. అశోక్‌నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగుల సమస్యలపై స్పందించకుండా నిరుద్యోగులకు భయపడి పారిపోయాడని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. మహాధర్నాలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, విద్యార్థి నాయకుడు విక్రమ్‌గౌడ్ తదితర సంఘాల నాయకులు నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.