TGPSC | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : మొత్తం ఆరు పేపర్లు. 900 మార్కులు. తెలిసిన విషయాలు రాసినా 150 మార్కుల పేపర్‌కు 10-20 మార్కులైనా వస్తాయి. గ్రూప్-1 మెయిన్స్‌లో పేపర్‌కు 10 మార్కులు కాదు కదా.. మొత్తం ఆరు పేపర్లు కలిపినా పది మార్కులేయలేదు. పైగా వారంతా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పాసైనవారే. ప్రతిభ చూపిన వారే. ఇక జనరల్ ఇంగ్లిష్‌లో 72 మార్కులొచ్చిన అభ్యర్థికి మొత్తం 6 పేపర్లు, 900 మార్కులకు వేసింది మూడు మార్కులే. ఇది టీజీపీఎస్సీ చెప్పుకునే అతి గొప్ప మూల్యాంకనం. గ్రూప్-1 మెయిన్స్‌లో కొందరు అభ్యర్థులకు 900 మార్కులకు 2, 3, 8,9, 6 మార్కులేశారు. ఈ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జనరల్ ఇంగ్లిష్‌లో 50శాతం మార్కులొచ్చిన వారికి 6 పేపర్లు కలిపినా 10-20శాతం మార్కులు రావా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మొత్తం లోపాల పుట్టగా తయారయ్యిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ అత్యంత కఠినమైన పేపర్. ఏండ్ల తరబడి ప్రిపేరైన వారే ఈ పేపర్ చూసి జడుసుకుంటారు. 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 2.32లక్షల మంది పరీక్షరాశారు. వీరిలో నుంచి 31 వేల మందిని మెయిన్స్‌కు ఎంపికచేశారు. మెయిన్స్ పరీక్ష రాసింది 21వేల మంది. వీరంతా మూడు నెలలుపాటు కష్టపడ్డవారే. కొంత మంది ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ సన్నద్ధమయ్యారు. ప్రిలిమ్స్ దాటిన వారికి మూడు, ఆరు మార్కులెలా వస్తాయన్న ప్రశ్నలు నిరుద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి.
వర్సిటీ ప్రొఫెసర్ల చేత మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ చెబుతున్నది. కా నీ డిగ్రీ, కాంట్రాక్ట్, ఎయిడెడ్ కాలేజీల లెక్చరర్లతో మమ అనిపించేశారని, ఇందుకు తా ము వందల ఆధారాలు చూపుతామని అభ్యర్థులంటున్నారు. తెలంగాణ ఉద్యమం పేపర్లను హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీతో మూల్యాంకనం చేయించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సివిల్స్ కంటే టీజీపీఎస్సీ మూల్యాంకనం అంత గొప్పదా..? అని నిరుద్యోగ జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సొసైటీ పేపర్‌ను పొలిటికల్ సైన్స్ వారితో, ఎన్విరాన్మెంట్ సెక్షన్‌ను ఎకనామిక్స్ ఫ్యాకల్టీతో మూల్యాంకనం చేయించినట్టు ఆరోపణలున్నాయి.
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం సమయంలోనే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టింది. అయితే సర్వేలో కాంగ్రెస్ అభ్యర్థి వెనుకబడ్డట్టు సర్కారుకు ఉప్పందింది. నిరుద్యోగులు, యువత అంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని సర్వేలో తేలింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా గ్రూప్-1 ఫలితాలు ప్రకటిస్తే నిరుద్యోగులను మచ్చికచేసుకోవచ్చని, గెలవవచ్చని ఎత్తుగడవేశారు. 6వేల అభ్యర్థుల పేపర్లను ఏపీలో మూడు నెలల్లో మూల్యాంకనం చేస్తే, 21వేల అభ్యర్థుల పేపర్లను రెండు నెలల్లో పూర్తిచేయడం వెనుక ఇదే జరిగిందని వారంటున్నారు. అయినా మూల్యాంకనం పూర్తికాకపోవడంతో ఫలితాలు ప్రకటించలేకపోయారని, కానిప్పుడు అనేక అక్రమాలు బయటపడుతున్నాయని అభ్యర్థులంటున్నారు.