హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): డిప్యూటీ సర్వేయర్ పోస్టులను పాత వీఆర్వోలు, వీఆర్ఏల ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటాన్ని నిరుద్యోగులు ఖండించారు. మంగళవారం వారు సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న పాత వీఆర్వోలు, వీఆర్ఏలను సర్వేయర్ పోస్టుల్లో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
2017 నోటిఫికేషన్ ప్ర కారం డిప్యూటీ సర్వేయర్ పోస్టులను ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని చె ప్పారు. అలాంటి పోస్టులను సాంకేతికంగా అర్హత లేని ఇంటర్, డిగ్రీ వారితో భర్తీ చేయడం అన్యాయమని వాపోయారు.
ఈ ప్రక్రియను నిలిపివేయాలని వినతిపత్రం అందజేశారు. సర్వేయర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు నిరుద్యోగులు తెలిపారు. జాబ్ క్యాలెండర్లో డిప్యూటీ సర్వేయర్ పోస్టులను చేర్చుతామని పేర్కొన్నట్టు వెల్లడించారు.