దుమ్ముగూడెం, ఆగస్టు 11 : తాలిపేరు ప్రాజెక్టు ప్రధాన కాల్వకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో ప్రధాన రహదారిపై సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతుసంఘం నాయకులు వంశీకృష్ణ, వేణు మాట్లాడుతూ ప్రధాన కాల్వ దెబ్బతినడంతో రామారావుపేట, మారేడుబాక, నర్సాపురం, తూరుబాక ఆయకట్టు భూములకు సాగునీరు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే అధికారులు, ప్రభుత్వం స్పందించి తాలిపేరు ప్రధాన కాల్వకు మరమ్మతులు చేపట్టాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.