Congress Corruption | ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో తెలంగాణలో రేవంత్ సర్కార్ ఎలా ముందుకుపోతున్నదో.. అక్రమాల్లోనూ అదే బాబు బాటలో నడుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ‘పనికి ఆహార పథకం’ ఎంతగా దుర్వినియోగమైందో.. ఊరూరా అక్రమాల జాతర ఎలా నడిచిందో అప్పటి తరం అందరికీ తెలుసు.. ఒకే పనికి రెండు కొలతలు వేసి.. చేయని పనికి రూ.కోట్లలో ఎలా కొల్లగొట్టారో ఇప్పటికీ ఊర్లలో ఎవరినడిగినా పొల్లుపోకుండా చెప్తారు.
ఇప్పుడు అదే మాదిరిగా కాంగ్రెస్ పెద్దలు అవినీతికి తెరలేపారు. ఇందుకు ‘భూగర్భాన్ని’ వేదిక చేసుకొని అక్రమాల తీగలు అల్లుతున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో అండర్ గ్రౌండ్ కేబుల్ పనులతో జేబులు నింపుకోవడానికి బిగ్ స్కెచ్ వేశారు. తీగలు నేలలోకి పోతే.. పైసల లెక్కలు మాత్రం ఆకాశానికి ఎక్కేలా ప్రణాళికలు గీశారు. కనిపించని కేబుళ్లకు అంచనాలు పెంచి.. కొలతల కాకిలెక్కలతో ఏకంగా రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టేందుకు ‘మినిస్టర్ టెన్ పర్సెంట్’ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : భూమి, గాలి, నీరు.. ఇలా ప్రతిచోటా అవినీతికి పాల్పడుతూ రూ.వేల కోట్లు దండుకుంటున్న అధికార పార్టీ నేతలు చివరికి భూగర్భాన్నీ వదలడం లేదు. వడ్డించేవాడు మనవాడైతే.. అనే తరహాలో ప్రభుత్వమే మనదైనప్పుడు దోపిడీకి అడ్డేమున్నది? అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో అండర్ గ్రౌండ్ కేబుల్ పనుల్లో అక్రమాలకు తెరలేపారు . కనిపించని కేబుళ్లతో ఏకంగా రూ. వెయ్యి కోట్లు కొల్లగొట్టేందుకు ‘మినిస్టర్ టెన్ పర్సెంట్’ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంలో విద్యుత్తు తీగలు, స్తంభాలు ఎక్కడా కనిపించకుండా మెట్రోజోన్ వ్యాప్తంగా మెగా భూగర్భ కేబుల్ ప్రాజెక్టుకు నిరుడు నవంబర్‌లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెంగళూరు, ముంబై, గుజరాత్ తరహాలో హైదరాబాద్ నగరాన్ని కేబుల్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనుకున్నది. ఇందుకోసం మొత్తం 14,725 కోట్లతో నగరవ్యాప్తంగా యూజీ కేబులింగ్ పనులు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు సర్కిళ్లలోని 11 డివిజన్లలో 4,051 కోట్లతో పనులు చేపట్టడానికి నిరుడు నవంబర్లోనే ప్రభుత్వం పాలనా అనుమతులిచ్చింది. కానీ తొమ్మిది నెలల్లోనే ఈ అంచనాలు భారీ మొత్తంలో పెరిగాయి. టెండర్లు పిలిచే సమయానికి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,756 కోట్లకు చేరింది. అంటే రూ.1,705 కోట్లు పెరిగిందన్నమాట. సామగ్రి ధరలు పెరిగాయని, రోడ్డు పునరుద్ధరణ కూడా తామే చేపడుతున్నామని, అందుకే ధరలు పెరిగాయని అధికారులు సమర్థించుకుంటున్నా.. మినిస్టర్ టెన్ పర్సెంట్ తనకు అనుకూలమైన అధికారులతో కలిసి రూ.వెయ్యి కోట్లు కొట్టేసేందుకు ప్లాన్ వేశారని ‘నమస్తే తెలంగాణ’ లోతైన పరిశీలనలో తేలింది.
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం యూజీ (అండర్ గ్రౌండ్) కేబుల్స్ 33 కేవీ 1,280 కిలోమీటర్లు ఉండగా, 11కేవీ కేబుళ్లు 957 కిలోమీటర్లు ఉన్నాయి. మరో 3,725 కిలోమీటర్ల 33 కేవీ ఓవర్‌హెడ్‌లైన్లు, 21,463 కిలోమీటర్ల 11కేవీ ఓవర్హెడ్లైన్లను యూజీగా మార్చడానికి నిర్ణయించారు. ఈ మేరకు 2025 జనవరిలో రూ.14,725 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. జనవరి 20న దక్షిణ డిస్కమ్ హైదరాబాద్ నగరంలో ఓహెచ్ పవర్లైన్లను అండర్‌గ్రౌండ్ పవర్ కేబుల్స్గా మార్చడం, ఇతర అనుబంధ పనుల కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) జారీ చేసింది. ఈవోఐలో తమ సాంకేతికత, అనుభవం, కేబుల్ తయారీదారులతో ఉన్న భాగస్వామ్యాలు, తయారీ సామర్థ్యాన్ని నిపుణుల కమిటీ ముందు వివరించాలని, మొత్తం అండర్‌గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టును ఎలా అమలు చేయాలన్న అంశాలపై ప్రతిపాదనలు అందించాలని పలు సంస్థలను ఆహ్వానించింది.
ఈవోఐలో 33/11కేవీ సబ్స్టేషన్లు 498, యూజీ కేబుల్ 1280 కిలోమీటర్లు, 33 కేవీ ఓహెచ్ లైన్లు 3,725 కిలోమీటర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు 1,022, 11కేవీ యూజీ కేబుల్ 957 కిలోమీటర్లు, 11కేవీ ఓహెచ్ లైన్లు 21,643 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 56,965 కిలోమీటర్లు, డీటీఆర్లు 1,50,992 ఉన్నట్టుగా తేల్చారు. ప్రైవేట్ సంస్థల సామర్థ్యం తెలుసుకోవడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడింది. ఓఆర్ఆర్ పరిధిలోని జీహెచ్ఎంసీతోపాటు దాని చుట్టుపక్కల మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు వంటివి ఈ యూజీ కేబులింగ్ ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. ఈ పనులపై ఫిబ్రవరిలో సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరికొందరు అధికారులు 2025 మేలో బెంగళూరుకు వెళ్లారు. అక్కడ బెస్కామ్ అధికారులతో సమావేశమై అండర్‌గ్రౌండ్ కేబులింగ్ వివరాలు తెలుసుకోవడంతోపాటు మల్లేశ్వరంలోని యూజీ పైలట్ ప్రాతాన్ని కూడా పరిశీలించారు. ఆ తర్వాత నాలుగు నెలలు ప్రాజెక్టు విభాగం అధికారులు ఒకటికి రెండుసార్లు గుజరాత్, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో యూజీ కేబులింగ్ ప్రాజెక్టు పనులు పరిశీలించి ప్రణాళికలు సిద్ధం చేశారు.
మొదటివిడత పనులకు నిరుడు నవంబర్‌లో రూ.4,051 కోట్లతో డీపీఆర్ రూపొందించగా, ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ 10 నెలలు గడిచేసరికి అంచనాలు రూ.5,756 కోట్లకు పెరిగాయి. అంటే.. రూ.1,705 కోట్లు పెరిగాయన్నమాట. ఇది పాలనా అనుమతులు ఇచ్చిన మొత్తంలో 42.1 శాతం అదనం. మొదట ప్రతిపాదించిన అంచనా వ్యయంలో కిలోమీటర్‌కు రూ.1.04 కోట్లు ఖర్చుకాగా, మారిన అంచనాల ప్రకారం ప్రభుత్వం కిలోమీటర్‌కు రూ.1.48 కోట్లు వెచ్చించనున్నది. అంటే ఒక్కో కిలోమీటర్‌కు సుమారు రూ.44 లక్షలు తేడా ఉండనున్నది. నిరుడు నవంబర్‌లో జారీ అయిన జీవోలో అప్పటి అంచనా ఎస్ఎస్ఆర్ రేట్ల ఆధారంగా రూపొందించారని, వాస్తవ పనుల సమయంలో ఫీల్డ్ కండిషన్లు, అమలులో ఉన్న రేట్ల ఆధారంగా వ్యయం మార్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో గరిష్ఠంగా 10 శాతం వరకు పెరుగుతుందని డిస్కమ్ అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏకంగా 42 శాతం పెంచడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభం కావడానికి ముందే అంచనాలు ఇంతా పెంచితే, రానురాను పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మొదటిదశ అంచనా వ్యయమే ఇంతగా పెంచితే, నగరం మొత్తం యూజీ పూర్తికావాలంటే వ్యయం రూ.30 వేల కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో రూ.14 వేల కోట్లుగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇలా అంచనాల భారీ పెంపుతో యూజీ కేబులింగ్ ప్రాజెక్టు పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కొత్త అంచనాల్లో రోడ్డు కటింగ్, ఫిల్లింగ్ వంటి జీహెచ్ఎంసీ చేయవలసిన పనులు కూడా తామే చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల మీడియా సమావేశంలో సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.700 కోట్లు పెరిగిందన్నారు. దీనికితోడు ఆర్ఎంయూ, ఇతర సామగ్రి ఉందని, గత ఎస్ఎస్ఆర్ రేట్లతోపాటు ఇతర రాష్ర్టాల పనుల రేట్లను పరిశీలించి, అందుకు తగినట్లుగా మార్పులు చేశామన్నారు. అయితే మిగతా రూ.1,005 కోట్ల పెరుగుదలకు కారణాలు, ఇతర అంశాలపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. పైగా ప్రశ్నలు అడిగిన విలేకరులను ‘మీరు టెండర్ వేస్తే చెప్పండి.. మీకు వివరాలిస్తాం’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
మొదటి డీపీఆర్‌లో 14,051 ఆర్ఎంయూలకు రూ.823 కోట్లు చూపించారు. అంటే సగటున ఒక ఆర్ఎంయూకు రూ.5.86 లక్షలుగా అంచనా వేశారు. ఇవన్నీ ఒకే రకమైనవి కాకపోయినా, సగటున లెక్క వేస్తే ఈ ధర వస్తుంది. ప్రస్తుతం టెండర్లలో 33 కేవీ స్కాడా ఎనేబుల్డ్ 3వే ఆర్ఎంయూ, 11కేవీ స్కాడా ఎనేబుల్డ్ 3/5/6 వే ఆర్ఎంయూ, 11కేవీ 3వే కాంపాక్ట్ ఆర్‌ఎంయూల సరఫరా కోసం ప్రత్యేక ఆర్ఎంయూ టెండర్లు వేసింది. అంటే సీఎండీ చెప్పినట్టుగా ఇందులో ఆర్ఎంయూ సామగ్రితోపాటు ఆర్ఎంయూ ప్లింత్, ఎరెక్షన్, లోడింగ్ అన్లోడింగ్ తోపాటు ఇతర సామగ్రి ఉంటే వాటికి అదనంగా రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందా అంటూ రిటైర్డ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ధరల్లో వ్యత్యాసం లేకపోతే సవరించిన డీపీఆర్‌లో ఆర్‌ఎంయూల సంఖ్య పెరిగిందా? అనేది ప్రస్తుతం అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న.
యూజీ కేబులింగ్ టెండర్లలో అంతర్గతంగా మూడురకాల టెండర్లు ఉన్నాయి. 33కేవీ, 11కేవీ యూజీ కేబుళ్ల సరఫరా కోసం ఐదు టెండర్లను పిలిచింది. ట్రెంచింగ్, కేబుల్ లేయింగ్, జాయింటింగ్, రోడ్డు పునరుద్ధరణ పనులు మరో రెండు టెండర్లలో పిలిచారు. ఇలా ఎందుకు విడదీశారని ఒక ప్రాజెక్టు అధికారిని అడిగితే.. ఏ ఒక్కరికో అప్పగిస్తే చాలా సమస్యలు వస్తాయని, అందుకే విడివిడిగా ఇచ్చామని చెప్పారు. వీటిల్లో 33 కేవీ, 11 కేవీ యూజీ కేబుళ్ల సరఫరాకు ఎస్పీడీసీఎల్ ఐదు వేర్వేరు టెండర్లను జారీ చేసింది. ఇవి మొత్తం 6,983 కిలోమీటర్ల సరఫరాకు సంబంధించినవి. ఇవి కేబుల్‌ను స్టోర్లకు సరఫరా చేసే టెండర్లు. ట్రెంచ్ ఎక్స్కవేషన్, లేయింగ్, జాయింటింగ్, రోడ్ రిస్టోరేషన్ వంటి పనులు ఇందులో లేవు. ఈ మొత్తానికి రూ.1,315 కోట్లుగా అంచనావేశారు. 2026-27 ఎస్‌ఎస్‌ఆర్‌లో 33కేవీ 3కోర్ 400 చదరపు మిల్లీమీటర్ ట్రీ రిటార్డెంట్ ఎక్స్ ఎల్పీఈ యూజీ కేబుల్ సరఫరా రేటు మీటరుకు రూ.3,019గా ఉన్నది. కానీ టెండర్లో మాత్రం రూ.3,300గా పేర్కొన్నారు. అంటే రూ.281 అధికంగా ఉన్నది. ఈ ప్రాజెక్టులో 810,833.9 మీటర్లు వినియోగించనున్నారు. మొత్తం 22.78 కోట్ల తేడా వస్తున్నది.
2025లో రూపొందించిన డీపీఆర్‌లో.. అంచనాలు అప్పటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే రూపొందించామని, అమలు సమయంలో కొంత మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఏయే అంశాలకు ఎంత పెరిగాయో మాత్రం వెల్లడించడం లేదు. సవరించిన డీపీఆర్‌ను కూడా రహస్యంగా ఉంచుతుండటంతో అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో జీవోలో అంశాలవారీగా అంచనాలు పేర్కొన్నారని, మరి ఇప్పుడు పారదర్శకంగా ఎందుకు లేదనే ప్రశ్న తలెత్తుతున్నది.
సీఎండీ చెప్పినట్టుగానే రోడ్ల పునరుద్ధరణ, ఇతర అదనపు పనులకు రూ.700 కోట్ల అంచనాలు పెరిగితే.. మిగతా రూ.1,005 కోట్లు ఎందుకోసం అనే చర్చ జరుగుతున్నది. మొదటి డీపీఆర్‌లో ఉన్న కిలోమీటర్లు, ఆర్ఎంయూ సంఖ్య, ఎల్టీ ఏబీ, ఓఎఫ్సీ తదితర పరిమాణాలు సవరించిన డీపీఆర్‌లోనూ అదే స్థాయిలో ఉన్నాయా లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్ఎస్ఆర్ లేదా మార్కెట్ ధరలతో పోలిస్తే కొత్త ధరలు ఎలా ఉన్నాయనేది మరో ప్రశ్న. అయితే.. అసలు మాయ అంతా హెచ్డీడీలో ఉన్నదని కొందరు నిపుణులు తెలిపారు. ఎస్‌ఎస్‌ఆర్‌లో హెచ్డీడీ రేటు మీటర్‌కు రూ.5,993గా ఉన్నది. అంటే కిలో మీటరుకు రూ.59.93 లక్షలు. ఇది సాధారణ ట్రెంచ్ లేయింగ్ కంటే చాలా ఎక్కువ.
అయితే.. హెచ్డీడీలో హెడీపీఈ కేసింగ్, డ్రిల్లింగ్ వంటి ప్రత్యేక పనులు ఉండటంతో రేటు ఎక్కువగా ఉంటుందని అధికారులు సమర్థించుకుంటున్నారు. అయితే ప్రతి డివిజన్లో ఎంత హెచ్డీడీ అవసరం, అదే రూట్లో ఓపెన్ ట్రెంచ్ సాధ్యమవుతుందా, డీపీఆర్‌లోని హెచ్డీడీ క్వాంటిటీతో ప్రస్తుత టెండర్ బీవోక్యూ క్వాంటిటీ సరిపోతుందా అనే లెక్కలపై తేడాలుంటాయని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఈసారి కొత్తగా రెండు పనులను ప్రతిపాదించారు. 33కేవీ, 11కేవీ యూజీ కేబుళ్లను హెచ్డీడీ పద్ధతిలో హెడీపీఈ పైప్ లేకుండా హార్డ్ సాయిల్, నార్మల్ సాయిల్లో వేయడానికి రెండు పనులు పెట్టారు.
గతంలో కూడా ఈ పనులు జరిగినా పైపులు లేవు. వీటి ద్వారా తాము ఖర్చు తగ్గిస్తున్నామని చెప్తున్నా ఈ పనులు చాలా తక్కువ మొత్తంలో జరుగడానికి అవకాశం ఉన్నదని కాంట్రాక్టర్లు చెప్పారు. ఇది కాకుండా ప్రాజెక్టులో ఉపయోగించే కేబుల్ జాయింటింగ్, టర్మినేషన్ కిట్ల ధరల విషయంలో వ్యత్యాసం కనిపిస్తున్నది. అలాగే ట్రెంచ్‌లెస్ టెక్నాలజీ, ఆర్ఎండీయూ లేదా ఆర్ఎంయూ వ్యవస్థ, స్కాడా, ఇంటర్నెట్ వంటి అంశాలను ఈ ప్రాజెక్టులో పొందుపరిచారు. అంతేకాకుండా ఇక్కడ మరో కీలకమైన అంశం కూడా ఉన్నది. కేబుల్ సరఫరా టెండర్లలో పరిమాణ మార్పులకు 50శాతం పెరుగడం లేదా తగ్గే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఎక్కడా తగ్గడం ఉండకపోగా పెరిగే అవకాశమే ఎక్కువ. దీంతో కేబుల్ పరిమాణ అంచనాలు కూడా పెరిగే అవకాశం ఉన్నది.
ఇంత భారీ మొత్తంలో అంచనాలు పెరుగడం వెనుక మినిస్టర్ టెన్ పర్సెంట్ ఉన్నట్టు డిస్కమ్‌లో చర్చ జరుగుతున్నది. గతంలో తన వాటా కోసం కేబుల్ కొనుగోళ్లే జరుగకుండా ఆపేశారని ప్రచారం జరుగుతున్నది. దీంతో చాలా పనులు నగరంలో ఆగిపోయాయి. ఆయనకు కమీషన్ ముట్టిన తర్వాతే కేబుల్ సరఫరాకు ఒప్పుకొన్నట్టు చెప్తున్నారు. యూజీ కేబులింగ్ టెండర్లలో మొదటి విడతగా రూ.4,051 కోట్ల అంచనాలు రూపొందించి జీవో ఇచ్చిన సమయంలో ఆ పెద్ద మనిషికి పెద్దగా లాభసాటి అనిపించలేదట. ఈ ప్రాజెక్టు బంగారుబాతు కావడంతో కావలసినంత పిండుకోవాలంటూ ఆలోచించి మొదటి విడతలోనే కనీసం రూ.వెయ్యి కోట్ల దోపిడీకి స్కెచ్ వేసినట్టు చెప్తున్నారు. తనకు అనుకూలమైన అధికారులతో ప్రాజెక్టు అంచనాలు, కాంట్రాక్టర్లతో ఒప్పందాలు, సంస్థలతో లోపాయికారీ మంతనాలు జరిపినట్టు ప్రచారం జరుగుతున్నది.
ముందుగా 20 శాతం పెంపుతో ప్రతిపాదనలు రూపొందించారని, అయినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో రోడ్ ఫిల్లింగ్ పనులు కూడా తామే చేస్తే బాగా వర్కవుట్ అవుతుందంటూ కొందరు అధికారులు చెప్పారట. దీంతో అన్నీ కలిపి చేయాలని మినిస్టర్ టెన్ పర్సెంట్ ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఎక్కడెక్కడ ఎలా ధరలు ఉన్నాయో చూసి, తమకు అనుకూలమైన కంపెనీలతో మాట్లాడారని, చివరికి రివైజ్డ్ డీపీఆర్ తయారు చేశారని మింట్ కాంపౌండ్ ఉన్నతాధికారులే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇందుకోసం ప్రాజెక్టు విభాగం మొత్తం మూడునెలలు అహర్నిశలు పనిచేసిందని, చివరికి రూ.1,705 కోట్లు అదనంగా పెంచారని ప్రచారం జరుగుతున్నది. ఒక్కో అంశంలో చిన్నచిన్న తేడాలుగా కనిపించినా.. అన్నీ కలిపితే రూ.వందల కోట్లకు చేరుతుందని వివరించారట.
మొత్తంగా రూ.5,756 కోట్లతో అన్నీ సిద్ధం చేశారని, ఇంకా ఏమైనా దోచుకోవాలంటే కేబుల్‌లో తీసుకుందామని, లేకుంటే పరిమాణాలు మార్చడానికి అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని సదరు అధికారులు మినిస్టర్ టెన్ పర్సెంట్‌కు చెప్పి సంతోషపెట్టారని డిస్కమ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
యూజీ కేబులింగ్ ప్రాజెక్టులో తమకు అనుకూలంగా వ్యవహరించని అధికారులను మినిస్టర్ టెన్ పర్సెంట్ తప్పించారని, తనకు అనుకూలమైన వారికి అవకాశం కల్పించారనే ప్రచారం జరుగుతున్నది. 2025 నవంబర్‌లో డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం ఇచ్చిన తర్వాత.. అంచనాలు మరో 20 శాతం పెంచాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి అప్ప టి డిస్కమ్ ముఖ్య అధికారికి ఒత్తిడి వచ్చింది. అలా వీలు కాదని, టెండర్లప్పుడే మరో పదిశాతం పెంచే అవకాశం ఉంటుందని ఆ అధికారి చెప్పిన ట్టు తెలిసింది. దీంతో తమకు అడ్డుపడుతున్న ఆ అధికారిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారని అంటున్నారు. ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఓ చీఫ్ అధికారిని కూడా బదిలీ చేశారు. వారి స్థానంలో తనకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రాజెక్టు విభాగంలో డమ్మీగా ఉన్న అధికారిని తీసుకొచ్చి కీలక అధికారిగా పోస్టింగ్ ఇచ్చారని, తన సొంత ఉమ్మడి జిల్లాకు చెందిన మరో అధికారిని తీసుకొచ్చి ముఖ్య అధికారిగా పోస్టింగ్ ఇచ్చారని చెప్తున్నారు.
ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ముందుగా అంచనాలను 16.64 శాతం పెంచి రూ.4,752 కోట్లకు చేర్చారు. దీనిపై కొందరి నుంచి ఈఆర్సీకి అప్పట్లో అభ్యంతరాలు రాగా, ఎస్పీడీసీఎల్ వివరణ ఇచ్చింది. అయితే ఈ పెంచిన అంచనాలు కూడా వర్కవుట్ కాకపోవడంతో మినిస్టర్ టెన్ పర్సెంట్ మరింత కావాలంటూ ఆదేశించారు. దీంతో అధికారులు స్వామిభక్తిని ప్రదర్శిస్తూ ఎక్కడా చిక్కకుండా రూ.1,705 కోట్లు అదనంగా పెంచారు. పురపాలక శాఖ చేపట్టాల్సిన రోడ్డు పునరుద్ధరణ పనులను కూడా కలిపి, రూ.5,756 కోట్లతో అంచనాలు వేసి టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో అధికారులను తప్పించి ఇష్టారాజ్యంగా వ్యవహరించడమే కాకుండా మరో కీలకమైన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. టెండర్లలో పనులకు సంబంధించిన సామగ్రి కొనుగోళ్లు, నిర్వహణకు సంబంధించిన పీఅండ్ఎంఎం విభాగం పనులు కూడా ప్రాజెక్టు విభాగమే చేసేలా కీలక డైరెక్టర్ల సమావేశంలో అనుమతులు పొందారు.
ఈ ప్రాజెక్టు పనులను ఒకేసారి కాకుండా విడతల వారీగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడతలో గ్రేటర్‌లోని నాలుగు సర్కిళ్లలో రూ.4,051 కోట్లతో డీపీఆర్ తయారుచేశారు. ఈ పనులకు నిరుడు నవంబర్‌లో ప్రభుత్వం పాలనా అనుమతులు ఇస్తూ జీవో 43 జారీ చేసింది. అధికారులు గత నెలలో టెండర్లు పిలిచారు. మెట్రోజోన్లోని బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిళ్ల పరిధిలోని 11 డివిజన్లు.. బంజారాహిల్స్, గ్రీన్‌ల్యాండ్స్, సైఫాబాద్, ప్యారడైజ్, కంటోన్మెంట్, మెహిదీపట్నం, చార్మినార్, బేగంబజార్, బోయినపల్లి, ఆస్మాన్‌గఢ్, ఆజామాబాద్‌కు సంబంధించిన అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
మొదటి విడత పనులను రెండేండ్లలో పూర్తిచేసి ఇవ్వాలంటూ నిబంధనలు విధించారు. ఆయా డివిజన్లలో 11కేవీ, 33 కేవీ విద్యుత్తు లైన్లతోపాటు ప్రధాన రహదారులపై ఉన్న ఎల్టీ ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్లు తొలగించి వాటి స్థానంలో యూజీ వేయాల్సి ఉంటుంది. అయితే ఆశ్చర్యకరంగా టెండర్లలో అంచనా వ్యయాన్ని రూ.5,756 కోట్లుగా పేర్కొన్నారు. గత నెల 25న టెండర్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈనెల 12న మధ్యాహ్నం ముగియనున్నది. అదే రోజు సాయంత్రం టెండర్లు తెరుస్తామని టీజీఎస్పీడీసీఎల్ అధికారులు చెప్పారు.