హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : దేశంలో నిజాయితీ అధికారులు, ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇల్లు, స్కూల్లోనే దానికి బీజం పడాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని బేగంపేట హరితప్లాజాలో ఆదివారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్(వైఏసీ) సంస్థ ఆధ్వర్యంలో 16 మంది నిజాయితీ అధికారులను సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాజకీయాల్లో సంసరణలతో అవినీతిని నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనా విధానం మారాలని, ప్రజా ఉద్యమాలను చేపట్టే వ్యక్తులను ప్రోత్సహించాలని సూచించారు. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. సమాజంలో అవినీతి జరుగుతుందని ప్రతి ఒకరూ అంటుంటారు.. కానీ, కండ్ల్లముందు జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వశాఖల్లో నిజాయితీపరులు ఎక్కడున్నారో వెతకడం కష్టమని, చాలామంది తప్పులు చేస్తూనే నిజాయితీగా ఉన్నట్టు నటిస్తారని చెప్పారు. చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ మాట్లాడుతూ.. మంచి సమాజం ఏర్పడాలంటే మంచి వ్యక్తులు కావాలని, ఆ వ్యక్తులకు గుర్తింపు ఉండాలని, ఆ గుర్తింపు వైఏసీ ఇస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. వైఏసీ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో అవినీతిరహితంగా, నిజాయితీగా పనిచేస్తున్న అధికారులను 14ఏండ్లుగా సన్మానిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వైఏసీ అవార్డు కమిటీ చైర్మన్ దన్నపనేని అశోక్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బకిని నర్సింహులు, డాక్టర్ స్రవంతి, డాక్టర్ స్నిగ్ధ, లక్ష్మీకళ, మీడియా కార్యదర్శి జయరాం, కోమటి రమేశ్‌బాబు, కొన్నె దేవేందర్, జీ హరిప్రకాశ్, వరికుప్పల గంగాధర్, బత్తిని రాజేశ్, చింతల రమేశ్, ఎం విక్రమ్, సీహెచ్ ప్రేమ్, కొకుల ప్రశాంత్, సూర రాజేందర్, నాగేంద్ర, నియామత్ బాషా, ఇలియాస్ పాల్గొన్నారు.