Demolitions | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): ‘అధికారికంగా ఉన్నా.. అనధికారికంగా ఉన్నా ఆ నివాస గృహాల జోలికి వెళ్లేది లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న ఇండ్లను కూలగొట్టం. చెరువుల ఆక్రమణల విషయంలో ప్రస్తుతం ఉన్న చెరువు స్థలాన్ని అభివృద్ధి చేస్తామే తప్ప ఇండ్ల జోలికే వెళ్లం. అసత్య ప్రచారాలు నమ్మవద్దు’ అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల హైడ్రా కార్యాలయంలో జరిగిన చెరువుల పునరుద్ధరణ మేధోమథన సదస్సులో వ్యాఖ్యానించారు. అదేరోజు సదస్సుకు సంబంధించి విడుదలైన అధికారిక ప్రెస్‌నోట్‌లో మాత్రం చెరువుల ఎఫ్టీఎల్ పట్టించుకోకుండా, సర్వే నెంబర్లను మార్చేసి నిర్మించిన కట్టడాలనే కూల్చేశామంటూ ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అనుమతులు లేకుండా ఉన్న పెద్దవాైళ్లెనా, పేదలవైనా ఇండ్లు కూల్చకతప్పదంటూ హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.
అధికారి నోటి నుంచి ఒక మాట! అధికారికంగా విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో మరోమాట! హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలపై , హైడ్రా కూల్చివేతలపై కొనసాగుతున్న చర్చ ఇది.
అసలు హైడ్రా కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కూల్చివేతలు కొనసాగిస్తారా!.. పేదల , పెద్దల ఇండ్లు కూల్చేయబోమంటూ బయటకు ప్రకటిస్తూ లోలోపల మాత్రం వేరే ప్లాన్‌తో ఉన్నారా?.. అసలు హైడ్రా ఏం చేయబోతున్నది? మళ్లీ బుల్డోజర్లతో తమపై విరుచుకుపడుతుందా?.. ప్రస్తుతం పలు చెరువుల వద్ద ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇండ్ల యజమానులు, పలు కాలనీలకు సంబంధించిన స్థానికుల మధ్య జరుగుతున్న చర్చ. తమ దగ్గరికి వచ్చే లేదా తమకు తెలిసిన అధికారులను పదేపదే ఇవే ప్రశ్నలు అడుగుతున్నట్టు సమాచారం. ఈ నెల 22న హైడ్రా కార్యాలయంలో చెరువుల పునరుద్ధరణ, ఎఫ్టీఎల్ నిర్ధారణ, వరద నీటి కాలువల పరిరక్షణ అంశాలపై పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు, నీటిపారుదలరంగ నిపుణులు, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పొల్యూషన్ తదితర శాఖలకు సంబంధించిన మేధావులతో కమిషనర్ రంగనాథ్ మేధోమథన సదస్సు నిర్వహించారు. ఇందులో ఒక రిటైర్డ్ ఇంజనీర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చెరువులను పరిరక్షించే సమయంలో తప్పుడు అనుమతులతో ఉన్న ఇళ్లను మాత్రమే కూల్చేశామని, ఈ కూల్చివేతలతోనే ప్రజల్లో హైడ్రా అంటే అవగాహన వచ్చిందన్నారు.
బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ అంటే ఏంటో హైడ్రా చర్యల వల్లే ప్రజలకు తెలిసిందని రంగనాథ్ అన్నారు. ఇప్పటివరకు ఎఫ్టిఎల్ పరిగణనలోకి తీసుకునే సర్వే చేయించామని, అనుమతులు రద్దు చేసినవి, అక్రమంగా అనుమతులు ఇచ్చిన కమర్షియల్ నిర్మాణాలనే కూల్చేస్తున్నామని చెప్పారు. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే కూల్చలేమని, సమాజమంతా బాధపడాల్సి వస్తుందని, కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుందని రంగనాథ్ అన్నారు. ఎఫ్టీఎల్లో ఉన్నా పర్మిషన్లు ఉంటే కూల్చేయబోమని, పర్మిషన్లు లేకున్నా అనధికారికంగా నివాసగృహాలు ఉంటే కూడా వాటి జోలికి వెళ్లబోమని ఆయన స్పష్టంచేశారు.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ..
మధ్యతరగతి, పేదల జోలికే వెళ్లి వారి ఇళ్లను కూల్చేసిన హైడ్రా హైరైజ్ బిల్డింగులను ఎందుకు కూల్చేయలేదని ఓ రిటైర్డ్ ఇంజనీర్ ప్రశ్నించగా.. రంగనాథ్ సమాధానమిస్తూ తాము ఇప్పటివరకు అక్రమనిర్మాణాలను మాత్రమే కూల్చేశామని చెప్పుకొచ్చారు. హైరైజ్ బిల్డింగుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే పోతున్నామని, ప్రధానంగా అక్కడ అనధికారికంగా అనుమతులు లేకుండా అక్రమం గా నిర్మాణాలు జరిగినా కోట్ల రూపాయల్లో నష్టపోయేది సామాన్య ప్రజలేనని అందుకే వాటిజోలికి వెళ్లలేదని బదులిచ్చారు. అయితే ఇదే మీటింగ్‌కు సంబంధించి విడుదల చేసిన అధికారిక నోట్లో మాత్రం చెరువుల ఎఫ్టీఎల్ పట్టించుకోకుండా, సర్వే నెంబర్లను మార్చేసి నిర్మించిన కట్టడాలనే కూల్చేశామని.. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అనుమతులు లేకుండా ఉన్న పెద్దవాైళ్లెనా, పేదలవైనా కూల్చకతప్పదంటూ హైడ్రా కమిషనర్ అన్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతాయా.. చెరువుల వద్ద నివాసగృహాల విషయంలో హైడ్రా ఏం చేయబోతోంది అన్న చర్చ ఓఆర్ఆర్లోపల పెద్దఎత్తున జరుగుతోంది.