వరంగల్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కోట్లాది రూపాయల విలువ చేసే భూఆక్రమణను (Land Grabbing) నాడు బీఆర్ఎస్ (BRS) సర్కార్ నిలువరించింది. అక్రమ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, బోర్డు ఏర్పాటుచేసింది. ఆ ప్రభుత్వం ఉన్నంత వరకు మళ్లీ ఆ ఛాయలకే రాకుండా పోయిన ఆ భూఆక్రమణదారు.. మళ్లీ కాంగ్రెస్ (Congress) సర్కార్ హయాంలో రెచ్చిపోతున్నాడు. ఓ కీలక ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడిగా పేరున్న అతను అదే భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం సాగుతున్నది. సదరు అనుచరుడి ఒత్తిళ్లు, ప్రజాప్రతినిధి సిఫారసులు తోడైతే కోట్లాది రూపాయల విలువైన ఆ భూమి అన్యాక్రాంతం అవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుర్రకాయలగూడెం (ప్రస్తుత భూపాలపల్లి ఎమ్మెల్యే స్వగ్రామం) రెవెన్యూ శివారులోని 10.33 ఎకరాల అసైన్డ్ భూమి కొంతకాలంగా కీలక ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడి ఆధీనంలో ఉన్నది.
గాంధీసెంటర్కు కూతవేటు (సిరోంచ-ఆత్మకూరు జాతీయ రహదారి) దూరంలో ఉన్న ఆ భూమి కోట్ల విలువ చేస్తుంది. సర్వే నంబర్ 15లో మొత్తం 15.33 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో నుంచి 1971లో ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులు, సైనికులు, ఇతరులైన ముగ్గురికి ప్రభుత్వం అసైన్ చేసింది. ఒకరికి 5 ఎకరాలు, మరొకరికి 5.12 ఎకరాలు, ఇంకొకరికి 4.32 ఎకరాలను అసైన్ చేసింది. ఇంకో 0.29 కరాల ప్రభుత్వ భూమి (ఖరజ్ ఖాతా) అని రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఆ ముగ్గురు అసైనీల్లో 5 ఎకరాలు పొందిన వ్యక్తి సాగులో ఉన్నారు. 4.32 ఎకరాలు, 5.12 ఎకరాలు పొందిన అసైనీలు (లబ్ధిదారులు) ఎంతోకాలం నుంచి ఆ భూమిని సాగుచేయడం లేదు. వారి వివరాలు స్థానికంగా ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని గమనించిన ఆ కీలక అనుచరుడు గుట్టుచప్పుడు కాకుండా అధికారుల ప్రోత్సాహంతో తన పేరు, తన సతీమణి పేరున రికార్డుల్లోకి ఎక్కించాడు. ఆ ఇద్దరి భూమితోపాటు ఖరజ్ఖాతాలోని 29 గుంటల భూమిని కూడా సొంతం చేసుకున్నాడు. ఇలా మొత్తం 10.33 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోగా పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ అయ్యాయి.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో స్వాధీనం
బుర్రకాయలగూడెంలో అసైన్డ్, ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి తమ పేరుమీద కాజేశారని వచ్చిన ఫిర్యాదుల మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. అనంతరం ఆ వ్యక్తి ఆధీనంలో ఉన్న 10.33 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ ఉన్నతాధికారులు స్థానిక అధికారులను ఆదేశించారు. ఆ మేరకు 2015 మే 12న గ్రామంలో ఆ 10.33 ఎకరాల వద్ద స్థానికుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఇది ప్రభుత్వ భూమి అని అక్కడ బోర్డును ఏర్పాటు చేశారు. తప్పుడు రికార్డులను సృష్టించి, రెవెన్యూ అధికారులు పాతిన బోర్డును యథేచ్ఛగా తొలగించి, ఆ 10.33 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమిలో మళ్లీ పాగా వేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ భూమిని తమ కుటుంబం పేరున రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం సాగుతున్నది.