Hyderabad | పిచ్చి కుదిరింది.. తలకు రోకలి చుట్టమన్నాడట! కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు కూడా అలాగే ఉంది. రామంతాపూర్‌లో కృష్ణరథయాత్రలో విద్యుత్తు తీగలు తగిలి ఐదుగురు చనిపోయిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు నగరంలో హాహాకారాలు సృష్టించాయి. ఎలుకల బెడదను తప్పించేందుకు ఇల్లు తగులబెట్టుకున్నట్టు.. వేలాడుతున్న విద్యుత్తు తీగలను సరిచేయలేక, మొత్తం అన్ని కేబుల్ వైర్లనూ కత్తిరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలివ్వడంతో కరెంటోళ్లు ఎక్కడికక్కడ రెచ్చిపోయారు. ఇంటర్నెట్, కేబుల్ వైర్లను కట్ చేసిపారేశారు. దీంతో నగరంలో చాలా ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 19 (నమస్తే తెలంగాణ): ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా రేవంత్ సర్కారు చేపట్టిన ‘విద్యుత్తు లైన్ల దిద్దుబాటు’ పనులు ప్రజలకు ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఒక ప్రణాళికతో ముందుగా చేయాల్సిన పనులను.. తర్వాత చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పేందుకు విద్యుత్తు శాఖ.. ప్రత్యేకించి టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది పనితీరే నిదర్శనంగా నిలుస్తున్నది. నిన్నటికినిన్న చెట్ల కొమ్మలు కత్తిరించడం లాంటి ఎండాకాలంలో చేయాల్సిన పనులను వానకాలంలో చేయడం ఆ శాఖకే చెల్లగా తాజాగా తమ పరిధిలో ఉన్న పోల్స్, వైర్లపై ఉన్న ప్రైవేట్ కేబుళ్లను నియంత్రించి విద్యుత్తు వ్యవస్థను ఒక్కరోజులోనే సంస్కరించాలనుకొని చేసిన పనికాస్తా బెడిసికొట్టింది.
రామంతాపూర్ ఘటనతో హడావుడి దిద్దుబాటు..
రామంతాపూర్‌లో ఆదివారం రాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ప్రమాదం జరగడం, కేబుల్ కారణంగా రథానికి కరెంట్ షాక్ తగిలి ఐదుగురు చనిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. యుద్ధప్రాతిపదికన డిష్ కేబుల్, ఇంటర్నెట్ వైర్ల కత్తిరింపు చేపట్టింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఆదేశాలతో విద్యుత్తు సిబ్బంది మంగళవారం రెచ్చిపోయారు. స్తంభాలపై ఉన్న కేబుళ్లను ఎక్కడికక్కడ కట్ చేయడంతో దక్షిణ డిస్కం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఒకేరోజులో విద్యుత్తు సిబ్బంది చాలా ప్రాంతాల్లో డిష్ కేబుళ్లు, ఇంటర్నెట్ లైన్లు కట్ చేశారు. కరెంట్ పోల్స్‌పై ఉన్న కేబుల్ వైర్లను తొలగించడంతో ఇంటర్నెట్ సేవలు మొత్తంగా నిలిచిపోయాయి. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా వేల మంది కేబుల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. ఇప్పుడు కరెంట్ సిబ్బంది వైర్లు కట్ చేస్తుండటంతో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా ఆగిపోయాయి.
ప్రైవేట్ ప్రొవైడర్లకు ఫిర్యాదుల వెల్లువ
కరెంట్ సిబ్బంది ఎక్కడికక్కడ వైర్లను కత్తిరించడంతో ఇంటర్నెట్, కేబుల్ టీవీ రావడం లేదని సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్లలో వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి. రెండు గంటల్లో 40 వేల కైంప్లెంట్లు వచ్చాయని ఎయిర్టెల్ ప్రకటించగా, 20 వేల ఫిర్యాదులు వచ్చాయని జియో ఫైబర్ చెప్పింది. మరోవైపు ఈ సర్వీస్ ప్రొవైడర్లకు కట్ అయిన వైర్లను ఎక్కడినుంచి లాగాలి? మళ్లీ ఎటువైపు వేయాలనేది సమస్యగా మారింది. ఓవైపు కట్ అవుతున్న వైర్లు, మరోవైపు కస్టమర్లతో వస్తున్న కాల్స్‌తో వారు తలలు బాదుకుంటున్నారు. నగరం లో 10 లక్షల మందికిపైగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘స్టాప్ కేబుల్ కటింగ్’ అంటూ ఇంటర్నెట్లో పోస్టులు పెడుతున్నారు.
వర్క్ ఫ్రం హోమ్‌కు కేబుల్ కష్టాలు
కరెంట్ స్తంభాలకు ఉన్న కేబుల్స్ తొలగించడంతో ఒక్కసారిగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. వైఫై కనెక్షన్లు ఉన్నట్టుండి ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక చాలామంది ‘వర్క్ ఫ్రం హోం’ సాఫ్ట్వేర్ ఉద్యోగులు తలలుపట్టుకు కూర్చున్నారు. తాము పనిచేసే సమయంలో కాల్స్ మధ్యలో ఉండగా ఒక్కసారిగా కనెక్షన్ ఎర్రర్ రావడంతో వారి ఎంప్లాయీస్ వాట్సాప్ గ్రూప్స్‌లో మెసేజ్ పెట్టి ఆ తర్వాత చూస్తే దాదాపుగా హైదరాబాద్‌కు చెందిన ఉద్యోగులంతా ఇదే తరహా మెసేజ్‌లు పెడుతుండటంతో ఏం జరిగిందంటూ ఆరా తీశారు. అప్పటికే తమ కాలనీల్లో ఇంటర్నెట్ వైర్లు కుప్పలు కుప్పలుగా కట్ చేసి పడి ఉండటంతో ఎప్పుడు పునరుద్ధరిస్తారోనంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వీకెండ్స్ అయితే ఏదోలా సర్దుకుపోవచ్చు కానీ వారం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి వస్తే తమ కంపెనీలు ఎలా స్పందిస్తాయోనంటూ టెకీలు టెన్షన్ పడుతున్నారు.
ఇండ్లల్లో గందరగోళం
ఇప్పుడంతా ఇంటర్నెట్‌మయం. ఇండ్లల్లో ఓటీటీలు, డిష్‌లు కూడా నెట్‌తోనే నడుస్తున్నాయి. అలాంటిది మంగళవారం ఉదయం నుంచి ఒక్కసారిగా ఇంటర్నెట్ నిలిచిపోవడంతో సర్వీస్ ప్రొవైడర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మళ్లీ నెట్ ఎప్పుడొస్తుందంటూ అడిగినా ప్రొవైడర్లు స్పందించడం లేదని పలు కాలనీవాసులు చెప్పారు. ఆ తర్వాత తమ కాలనీలు, వీధుల్లో ఎక్కడపడితే అక్కడ స్తంభాల వద్ద కేబుల్స్ కట్ చేసి ఉండటం చూసి వాటిపై ఆరా తీస్తే కరెంట్ వాళ్లు వచ్చి తీసేశారని తెలియడంతో ప్రస్తు తం ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘మైండ్‌లెస్ యాక్షన్’
గతంలో చాలాసార్లు సర్వీస్ ప్రొవైడర్లు, కేబుల్ సంస్థలతో సమావేశమైనా వారు పెడచెవిన పెట్టారని విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. కేబుల్స్ కారణంగా పోల్స్‌పై సరఫరాలో అంతరాయాలను సవరించాల్సిన తమ లైన్మెన్లకు ఇబ్బంది అవుతున్నదంటూ మీటింగ్‌ల్లో మాట్లాడుకోవడమే తప్ప కేబుళ్ల విషయంలో అసలు సీరియస్ నెస్ చూపలేదని ఓ రిటైర్డ్ విద్యుత్తు అధికారి చెప్పారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది కేబుల్స్ విషయంలో కుమ్ముక్కవడం మూలానే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని, బస్తీల్లో స్తంభాల వద్ద కుప్పలుకుప్పలుగా కేబుల్స్ కనిపిస్తాయని తెలిపారు. ఒక్కో పోల్ వద్ద సుమారు 20 నుంచి 30 కిలోల కేబుల్స్ ఉన్నట్టు ప్రతి సందర్భంలో ఆయా పోల్స్‌ను సందర్శించి లోపాలపై సమీక్షించే లైన్మెన్ నుంచి డీఈ స్థాయి అధికారి వరకు తెలిసినా పట్టించుకోరని డిస్కంలోనే చర్చ నడుస్తున్నది. రామంతాపూర్ లాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక్కసారిగా ఏదో హడావుడి చేసేసి మళ్లీ పాతపద్ధతిలోనే పోతారని చెప్పుకొంటున్నారు. కొన్ని అనవసర కేబుళ్ల తొలగింపు ప్రక్రియ మానేసి ఇంటర్నెట్, డిష్ కేబుళ్లను తొలగించడం వల్ల సామాన్యులు, ఉద్యోగులు ఇబ్బంది పడతారన్న విషయాన్ని డిస్కం అధికారులు, ప్రభుత్వ పెద్దలు మరిచిపోయారని, మెదడుపెట్టి ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని ‘మైండ్‌లెస్ యాక్షన్ బై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్’ అంటూ పలువురు నెటిజన్లు తీవ్రంగా ట్వీట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు ఆదేశాలతో ఎన్పీసీడీఎల్ చేస్తున్న ‘కేబుల్ కటింగ్’ పనులపై వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఏమాత్రం ఆలోచించరా? అని ఫైర్ అవుతున్నారు. కనీస సమయం కూడా ఇవ్వకుండా హఠాత్తుగా వర్కింగ్ డేస్‌లో కట్ చేస్తే ఉద్యోగాలు ఎట్లా చేసుకోవాలని నిలదీస్తున్నారు.
ఇంటర్నెట్ డిస్కనెక్ట్ కావడంతో నా ఉద్యోగం పోయింది. ప్రభుత్వానికి థాంక్స్.. నాకు ఈ సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు నేనిక గవర్నమెంట్‌కు ట్యాక్స్‌లు కట్టను..
-ఆవేదనతో కూడిన వ్యంగ్యంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ట్వీట్
ఇంటర్నెట్ కేబుల్స్ కావాలనే తొలగిస్తున్నరు. సీసీ టీవీ రికార్డింగ్స్ మొత్తం నిలిచిపోయాయి. వర్క్‌ఫ్రంహోమ్ ఉద్యోగులకు చాలా కష్టాలు ఎదురవుతున్నయి. ఈ పనిని ఆపేయండి
-నగరానికి చెందిన లాయర్ అజీమ్ మహ్మద్ ట్వీట్
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి గానీ, ఎన్పీడీసీఎల్ నుంచి గానీ ముందస్తు నోటీసు లేకుండా సడెన్‌గా ఎలా కనెక్షన్లు కట్ చేస్తరు? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అసలు మేం ఎలా పనిచేయాలో చెప్పండి.
-తెలంగాణ సీఎంవో, రేవంత్, భట్టిని ట్యాగ్ చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రణయ్‌కుమార్ ట్వీట్