రఘునాథపల్లి, డిసెంబర్ 1 : భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతిచెందాడు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెంలో సోమవారం చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బత్తిని ఎల్లమ్మ (54), సత్తయ్య (60) దంపతులు. ఎల్లమ్మ 18 ఏండ్ల క్రితం ఆటో ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైంది. దీంతో భర్త సత్తయ్య భార్య ఆలనాపాలన చూస్తున్నాడు. సోమవారం ఉదయం ఎల్లమ్మ మృతి చెందడంతో మనస్తాపం చెందిన భర్త నాలుగు గంటల వ్యవధిలోనే మరణించాడు.