సిద్దిపేట టౌన్, మే 19 : అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం అదృశ్యమైన ఘటన సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట సీఐ వాసుదేవరావు కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని ఖాదర్‌పురాకు చెందిన వీరబత్తిని బాలకిషన్ కుటుంబం శనివారం నుంచి కనిపించడంలేదు. బాలకిషన్ కుటుంబంలో మొత్తం ఐదుగురు తమ ఫోన్లు ఇంట్లో వదిలి వెళ్లారు.
స్థానికులు, బంధువులు వీరు ఏదైనా ఊరికి వెళ్లారని అనుకున్నారు. రెండు రోజులైనా వారి జాడతెలియక పోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు అప్పులు ఉన్నాయని, డబ్బులు ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కూడా కట్టలేక పోతున్నానని, అందుకే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు బాలకిషన్ లేఖ రాసినట్టు బంధువులు పోలీసులకు తెలిపారు. సిద్దిపేట ఏసీపీ మధు సోమవారం బాలకిషన్ ఇంటిని సీఐ వాసుదేవరావుతో కలిసి వెళ్లి పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఏసీపీ తెలిపారు.