హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ర్యాగింగ్‌ను అరికట్టడం సహా యాంటి ర్యాగింగ్ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంపై రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఇందులో రాష్ర్టానికి చెందిన ఏడు విద్యాసంస్థలున్నాయి. విద్యార్థుల నుంచి యాంటి ర్యాగింగ్ అండర్ టేకింగ్స్ తీసుకోవడంతోపాటు ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించడంలో నిర్లక్ష్యం వహించినందుకు దేశంలోని 89 విద్యాసంస్థలకు యూజీసీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. నోటీసులందిన 30 రోజుల్లో విద్యార్థుల నుంచి యాంటి ర్యాంగింగ్ ఆన్లైన్ అండర్ టేకెన్లు తీసుకోవాలని, క్యాంపస్‌లో ర్యాగింగ్‌ను నిరోధించేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. యూజీసీ-2009 రూల్స్ ప్రకారం విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నియంత్రించడం తప్పనిసరి. నిబంధనలు పాటించని విద్యాసంస్థల పేర్లను యూజీసీ వెబ్సైట్లో బహిర్గత పరుస్తామని హెచ్చరించింది. యూజీసీ నుంచి అందే గ్రాంట్స్‌ను ఉపసంహరిస్తామని, పరిశోధన ప్రాజెక్ట్‌లను నిలిపివేస్తామన్నది. అవసరమైతే విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు, అఫిలియేషన్ ఉపసంహరణకు కూడా వెనుకాడబోమని యూజీసీ హెచ్చరించింది.