హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ‘అప్పుచేసి పప్పుకూడు’ అన్నది పాత సామెత.. ‘అప్పు చేసి బిర్యానీ తిను’ అన్నది నేటి కాంగ్రెస్ సర్కారు నినాదం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేం బాగాలేదు.. జీతాలివ్వలేకపోతున్నాం.. అంటూ నిత్యం గగ్గోలుపెట్టే కాంగ్రెస్ సర్కార్ తాజాగా భూగర్భ కేబుళ్ల పేరిట కొత్త ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. కానీ అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టి, అందినంత దండుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వ పెద్దల అసలు ఆంతర్యం అని విమర్శిస్తున్నారు. కొత్తగా తీసుకొస్తున్న అప్పుల వెనుక కూడా అదే కుట్ర దాగి ఉన్నదని అంటున్నారు. ప్రాజెక్ట్ ద్వారా 10శాతం కమీషన్లు దండుకునేందుకు పథకం రచిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లో భూగర్భకేబుళ్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 2వేల కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ కేబుళ్లు వేయనున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను అధికారులు సిద్ధం చేశారు. ఈ రెండు వేల కిలోమీటర్లకు మొత్తం రూ.13 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తేల్చారు. అయితే ఈ రూ.13వేల కోట్లను ప్రభుత్వం సొంతంగా సమకూర్చే పరిస్థితి లేదు. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కొత్త అప్పు కోసం అధికారులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతీవారం ఢిల్లీ వెళ్లి అప్పుల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికిప్పుడు విద్యుత్తు సరఫరా వ్యవస్థలో వచ్చిన ఉపద్రవమేదీ లేదని నిపుణులు చెప్తున్నారు. ఉన్నఫలంగా ఓవర్‌హెడ్ కేబుళ్లను అండర్‌గ్రౌండ్‌కు మార్చాల్చిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు లేవు కదా అని నిలదీస్తున్నారు. ఇవేమీ లేకుండానే భూగర్బ కేబుల్ ప్రాజెక్ట్‌కు సర్కార్ పచ్చజెండా ఎందుకు ఊపిందని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయని, రాష్ట్రంలోని నాలుగు విద్యుత్తు సంస్థలపై లక్ష కోట్ల అప్పుందని, వడ్డీల భారం తడిసి మోపెడవుతున్నదని వివరిస్తున్నారు. డిస్కంల క్రెడిట్ రేటింగ్ దిగజారుతున్నదని చెప్తున్నారు. ఈ తరుణంలో మరో రూ. 13వేల కోట్ల అప్పునకు ప్రభుత్వం సిద్ధపడటం దారుణమని మండిపడుతున్నారు. కమీషన్ల కోసమే అప్పులు తెచ్చి మరీ ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఆర్టీసీలో ఇటీవల పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తున్నారు. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆర్టీసీ కంటోన్మెంట్ డిపో, హయత్‌నగర్ డిపోల్లో హెచ్‌టీ కనెక్షన్ కోసం ప్రభుత్వానికి ఆర్టీసీ దరఖాస్తు చేసింది. అండర్‌గ్రౌండ్ కేబుళ్లు వేసి, కనెక్షన్ జారీ చేయాలని కోరింది. ఇందుకు అవసరమైన కోట్లాది రూపాయల డబ్బులను చెల్లించింది. కేబుళ్లు లేకపోవడంతో అండర్‌గ్రౌండ్‌లో వేయాల్సిన కేబుళ్లను ఓవర్‌హెడ్ (ఎలివేటెడ్) ద్వారా వేసి కనెక్షన్ ఇచ్చి.. మమ అనిపించేశారు. 200-300 మీటర్లకే అండర్ గ్రౌండ్ కేబుల్స్‌ను సమకూర్చలేని వారు, 2వేల కిలోమీటర్లకు ఎట్టా సమకూర్చుతారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మనది హైవోల్టేజ్ విద్యుత్తు సరఫరా వ్యవస్థ. చాలా దేశాలు, నగరాల్లో లో వోల్టోజ్ లైన్లను అండర్‌గ్రౌండ్‌లోకి మార్చారు. కానీ మనదగ్గర హై వోల్టేజ్లైన్లను యూజీలోకి మార్చబోతున్నారు. ఇది సమస్యాత్మం కానున్నది.
ఒకే భౌగోళిక ప్రాంతంలో ఎల్టీ కనెక్షన్లు, హెచ్‌టీ కనెక్షన్లు ఉంటాయి. హెచ్‌టీ లైన్, ఎల్టీలైన్ వేర్వేరుగా ఉంటాయి. మరీ అండర్ గ్రౌండ్ కేబుళ్లు వేస్తే హెచ్టీకి, ఎల్టీకి వేర్వేరుగా వేయాల్సి ఉంటుంది. ఇది భారంగా మారే ప్రమాదముంది.
కోల్‌కత్తాలో మూడు మార్గాల్లో భూగర్భకేబుళ్లు వేశారు. అక్కడ కేబుల్డక్డ్ను వేశారు. మొదట ఐదుమార్గాల్లో వేసి, ఆ తర్వాత రెండేండ్లకు ఆరో డక్ట్‌ను వేశారు. మన దగ్గర డక్ట్వేసినా అనేక సమస్యలు పొంచి ఉన్నాయి. అకాల వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదలు ముంచెత్తితే డక్ట్ మునిగిపోతుంది. దీంతో విద్యుత్తు సరఫరా నిలిపివేయాల్సిందే.
డక్ట్ కాకుండా నేరుగా తవ్వకాలు జరిపి కేబుళ్లు వేసుకుంటూ వెళ్లినా చిక్కులు తప్పవు. ఏ కేబుల్ ఎక్కడుందో గుర్తించడం కష్టం. పైగా భవిష్యత్తులో ఎప్పుడైనా రోడ్లు, డ్రైనేజీ, టెలిఫోన్, ఇంటర్నెట్ కేబుళ్లు వేసేందుకు రోడ్లు తవ్వితే కేబుళ్లు తెగి, విద్యుత్తుషాక్‌తో జరిగే నష్టాన్ని అంచనావేయలేం.
చాలా దేశాలు, రాష్ట్రాల్లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, శాటిలైట్ సిటీల్లో మాత్రమే భూగర్భ కేబుళ్లు వేశారు. కానీ మన దగ్గర ఇప్పటికే వేసిన కేబుళ్ల స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుళ్లు వేస్తున్నారు. దీనిపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.
భూగర్భ కేబుళ్ల వేసిన ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ కేబుళ్లను తొలగిస్తారు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే మొత్తం విద్యుత్తు సరఫరా వ్యవస్థే కుప్పకూలే ప్రమాదముంది. విద్యుత్తు సరఫరా చేద్దామంటే ఓవర్‌హెడ్ వ్యవస్థ కూడా ఉండదు.
అండర్ గ్రౌండ్ కేబుళ్లను రీపేర్ చేసేందుకు సాంకేతిక నిపుణులు అవసరం. వీరిని ఎలా రిక్రూట్చేసుకుంటారనే సందేహాలు ఉన్నాయి.