హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఉన్నతాధికారుల బృందం బయో ఏషియాలో పాల్గొన్నదని అమెరికన్ కాన్సులేట్ పేర్కొన్నది. శనివారం ఈ బృందం ‘ఇండియా ఫర్ ఇండియా అండ్ ఇండి యా ఫర్ ద వరల్డ్: వేర్ డస్ క్వాలిటీ స్టాండ్’ అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్నదని చెప్పింది. ఎఫ్డీఏ గ్లోబల్ పాలసీ అండ్ స్ట్రాటజీ విభాగం అసోసియేట్ కమిషనర్ మార్క్ అబ్డో నేతృత్వంలోని బృందం ఈ నెల 23 నుంచి 25 వరకు రెండు తెలుగు రాష్ర్టాల్లో పర్యటించిందని పేర్కొన్నది.
ఈ సందర్భంగా అబ్డో మాట్లాడుతూ ఎఫ్డీఏ అనుమతులు పొందిన ఔషధ ఉత్పత్తి సంస్థలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. సురక్షిత, ప్రభావంతమైన ఉత్పత్తులు రావాలంటే పరిశ్రమలు, ప్రభుత్వం కలిసి పని చేయాలని సూచించారు. 23, 24 తేదీల్లో ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీలో పర్యటించారని కాన్సులేట్ పేర్కొన్నది. ఎఫ్డీఏ బృందంలో ఇండియా డైరెక్టర్ సారా మెక్కల్లం, ఇంటర్నేషనల్ డ్రగ్ క్వాలిటీ విభాగం డైరెక్టర్ కార్మెలో రోసా తదితరులు ఉన్నారు.