నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు సరదాగా వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆ యువకులు అంతలోనే మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు అలీసాగర్ ఎత్తి పోతల పథకం స్టేజ్ -2 కాల్వలో పడి మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన రెంజల్ మండలం బాగేపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. బోధన్ మండలం కలుదుర్కి గ్రామానికి చెందిన శ్రీకాంత్, ఖండ్గావ్ గ్రామానికి చెందిన శ్రవణ్ రెంజల్ మండలం కునేపల్లి గ్రామంలో ఓ పెండ్లికి వచ్చి.. ప్రమాదవశాత్తు కాలువలో జారీ పడటంతో మృత్యువాత పడ్డారు. రెంజల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.