జగిత్యాల/ ముస్తాబాద్, ఆగస్టు 24 : బహ్రెయిన్ దేశంలో గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం, నిల్వ చేయడం, మారెటింగ్ చేసిన ఆహార భద్రతా కేసులో ముగ్గురికి మూడేండ్లు, 19 మందికి రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయాన్ని బహ్రెయిన్ మీడియా ఈ నెల 20న వెల్లడించింది. అందులో ఐదుగురు తెలంగాణకు చెందిన కార్మికులు ఉన్నారని బహ్రెయిన్‌లోని తెలంగాణ సామాజిక సేవకుడు కోటగిరి నవీన్ తెలిపారు. ఈ కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా కొండాపూర్‌కు చెందిన బాబుకు రెండేండ్ల శిక్ష పడగా, అతడి మేనమామ ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాబు ఏడేండ్ల్లుగా బహ్రెయిన్‌లో ఉంటున్నాడు. మే 15 నుంచి తనను ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి చేయాలని, అల్ దాయ్సి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యాజమాన్యానికి బాబు మార్చి 2న దరఖాస్తు చేసుకున్నాడు. ఇండియాకు రావాల్సిన అతను అనుకోకుండా జైలు పాలయ్యాడు.
గోదాంలో ఆహార ఉత్పత్తులపై లేబుళ్లు తొలగించి, కొత్త తేదీలతో స్టికర్లు అతికించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులను ఉపయోగించి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టివేసింది. యాజమాన్యం చెప్పినట్టు చేయడం 19 మంది ప్రవాసీ కార్మికుల పాలిట శాపమైందని తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాబు సహా ఐదుగురిని విడిపించాలని కోరారు.