చర్లపల్లి/బండ్లగూడ, సెప్టెంబర్ 16: మహానగరంలో మంగళవారం ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు కనిపించడంతో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. రాజేంద్రనగర్, చర్లపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో ఆ మహిళల మృతదేహాలు పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ ఆటోస్టాండ్ వద్ద గోనె సంచిని గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. దుర్వాసన వస్తుండటంతో స్థానికు లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు లు తెరిచి చూడగా కుళ్లిపోయిన స్థితిలో 40 ఏండ్ల మహిళ మృతదేహం బయటపడింది. హత్యచేసి ఇక్కడ పడేశా రా? అన్న అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కిస్మత్పుర బ్రిడ్జి కింద ఓ మహిళ మృతదేహం పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మహిళ ఒంటిపై బట్టలు లేకపోవడంతో ఎవరైనా లైంగికదాడి చేసి హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మూడురోజుల క్రితమే హత్య జరిగి ఉండొచ్చని తెలిపారు. కేసు నమోదు చేసుకొని వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టామని ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు.