జగిత్యాల కలెక్టరేట్, ఫిబ్రవరి 23 : ఆస్తి కోసం సొంత అన్ననే ఇద్దరు చెల్లెళ్లు దారుణంగా హత్య చేశారు. కట్టెతో కొట్టి.. పిడిగుద్దులు గుద్ది ప్రాణం తీశారు. జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, మృతుడి భార్య విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన జంగిలి బసవయ్యకు కొడుకు శ్రీనివాస్, కూతుళ్లు వరలక్ష్మి, శారదతోపాటు మరో కూతురు ఉంది. శ్రీనివాస్ ఆర్టీఏ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతని పెద్ద చెల్లె భారతపు వరలక్ష్మి భర్త 22 ఏండ్ల క్రితం చనిపోవడంతో అప్పటి నుంచి తల్లిగారి ఇంట్లోనే ఉంటోంది. శ్రీనివాస్ మరో చెల్లెలు వొడ్నాల శారద భర్తను వదిలేసి వీరి ఇంటికి సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నది. ఈ క్రమంలో శ్రీనివాస్ ఇంటికి ఆనుకొని ఉన్న 100 గజాల స్థలాన్ని తమకు ఇవ్వాలని వరలక్ష్మి, శారద తండ్రి బసవయ్యపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. సదరు స్థలాన్ని కొడుకు శ్రీనివాస్‌కు ఇస్తానని తండ్రి పదేండ్ల కిందటే చెప్పడంతో వరలక్ష్మి, శారద గొడవ చేసి శ్రీనివాస్‌పై కేసులు పెట్టారు. సదరు కేసు కోర్టులో నేటికీ నడుస్తున్నది.
అప్పటి నుంచి శ్రీనివాస్‌ను ఇద్దరు చెల్లెళ్లు ఇష్టంవచ్చినట్లు తిట్టడం, నిత్యం గొడవలకు దిగుతుండడంతో శ్రీనివాస్ భార్య విజయలక్ష్మి పిల్లలతో కలిసి హనుమాన్‌వాడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకు శ్రీనివాస్ తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. ఆదివారం తల్లిదండ్రులకు టిఫిన్ ఇద్దామని శ్రీనివాస్ వెళ్లాడు. అక్కడ అన్నను చూసిన వరలక్ష్మి, శారద ‘ఇక్కడికెందుకు వచ్చినవు.. నీ వల్లనే గొడవలు జరుగుతున్నయి. కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. నువ్వు సత్తెనే అన్ని లొల్లులు పోతయి’ అని శ్రీనివాస్‌ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ దాడికి దిగారు. బసవయ్య చేతికర్రను తీసుకుని వరలక్ష్మి శ్రీనివాస్ తల వెనుక భాగంలో దాడి చేయగా, శారద పిడిగుద్దులు గుద్దడంతో రోడ్డుపై స్పృహతప్పి పడిపోయాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ భార్య వరలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని బంధువులు, స్థానికుల సహాయంతో శ్రీనివాస్‌ను జగిత్యాల జిల్లా దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు శ్రీనివాస్ మృతిచెందినట్టు నిర్ధారించారు. ఇద్దరు ఆడబిడ్డలు భర్తను కట్టెలతో కొట్టి అన్యాయంగా చంపారని మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వేణుగోపాల్ తెలిపారు.