మణుగూరు టౌన్, నవంబర్ 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని గ్రేస్మిషన్ పాఠశాలలో ఆదివారం విద్యుత్తు షాక్ తగిలి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతిచెందారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం కాళీమాత ఏరియాకు చెందిన ఉపేందర్, రత్నం పట్టణ పరిధిలోని గుట్టమల్లారం గ్రేస్ మిషన్ పాఠశాలలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఆదివారం పాఠశాల గోడకు అమర్చిన ఐరన్ పైపులు తొలగిస్తుండగా విద్యుత్తు తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యారు.
ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ సతీశ్‌కుమార్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఉపేందర్, రత్నం మృతి బాధాకరమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. విషయం తెలుసుకున్న ఆయన పాఠశాలను సందర్శించారు. గ్రేస్ మిషన్ స్కూల్ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.