హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇద్దరు తమ కార్పొరేషన్ చైర్మన్ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమం మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ (టీఎస్‌హెచ్‌డీసీ) చైర్మన్ చింతా ప్రభాకర్ రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను మంగళవారం వేర్వేరుగా సీఎస్ శాంతికుమారికి పంపించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పలువురికి కార్పొరేషన్ పదవులను కట్టబెట్టింది. కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుండటంతో వారు తమ పదవులకు రాజీనామాలు చేశారు. 21 మాసాలపాటు ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, మాజీ మంత్రులు కేటీఆర్‌కు, హరీశ్‌రావుకు, సబితాఇంద్రారెడ్డికి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లకు శ్రీధర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రభుత్వం మారడంతో తన చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు సీఎస్‌కు పంపిన లేఖలో చింతా ప్రభాకర్ పేర్కొన్నారు.