రైల్వే జీఎంతో హరీశ్‌రావు భేటీ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్‌తో బుధవారం రైల్ నిలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట, మెదక్ ప్రాంతాలకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఆయా రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని హరీశ్‌రావు కోరగా, జీఎం సానుకూలంగా స్పందించారు.
Railway Projects | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి ఎట్టకేలకు రెండు రైల్వే ప్రాజెక్టులను రైల్వేశాఖ మంజూరు చేసింది. ఇందులో ఔటర్ రింగ్‌రైలు ప్రాజెక్టుతోపాటు పటాన్చెరు (నాగులపల్లి)-ఆదిలాబాద్‌కు కొత్త రైల్వేలైన్ ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.18,114 కోట్లు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం వెల్లడించారు. ఇందులో ఔటర్ రింగ్‌రైలు ప్రాజెక్టుకు రూ.12,408 కోట్లు, పటాన్చెరు-ఆదిలాబాద్ కొత్త రైల్వేలైన్‌కు రూ.5,706 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఔటర్ రింగ్‌రైలు ప్రాజెక్టును రీజనల్ రింగ్‌రోడ్‌కు అవతలి భాగం నుంచి ఏర్పాటు చేస్తారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట, సిద్దిపేట, గజ్వేల్, యాదాద్రి భువనగిరి, రామన్నపేట, చిట్యాల, నారాయణపూర్, షాద్‌నగర్, షాబాద్ మీదుగా అవుటర్ రింగ్‌రైలు ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇది వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలతోపాటు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ వంటి ముఖ్యమైన పట్టణాలను కలుపుతుంది. ఈ ప్రాజెక్టు శాటిలైట్ టౌన్‌షిప్‌లు, పారిశ్రామికప్రాంతాలకు మల్టీమోడల్ కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు రావడం వల్ల హైదరాబాద్‌కు అదనపు సబ్-అర్బన్ సేవలతోపాటు దూర ప్రాంత సేవలు పెంచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిడివి 564 కిలోమీటర్లు ఉంటుందని వెల్లడించారు.
పటాన్చెరు-ఆదిలాబాద్ లైన్
పటాన్చెరు (నాగులపల్లి)-ఆదిలాబాద్ మధ్య 317 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇచ్చోడ, నేరడిగొండ, ధనుర్, నిర్మల్ వంటి ప్రధాన పట్టణాలకు రైలు కనెక్టివిటీ పెరగనున్నది. బాల్కొండ, ఆర్మూర్, బోధన్, రుద్రూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ, నిజాంసాగర్, అల్లాదుర్గ్, సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాలతోపాటు కొత్త ప్రాంతాలతో రాష్ట్ర రాజధానితో అనుసంధానం పెరుగుతుందని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ రెండు రైల్వే ప్రాజెక్టుల వల్ల.. హైదరాబాద్ నుంచి అన్ని ప్రాంతాలకు రైలు అనుసంధానం పెరుగుతుందని, ప్రయాణికులతోపాటు సరుకు రవాణాకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులను 90 కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.