వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 25 : వరంగల్ ఎంజీఎం దవాఖానలో పీడియాట్రిక్ వార్డు పై వైద్యాధికారులు, విభాగాధిపతుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. శనివారం ఎంజీఎం హాస్పిటల్లో చోటుచేసుకున్న ఘటన తెలంగాణ వ్యాప్తంగావున్న ప్రభుత్వ దవాఖానల దుస్థితికి అద్దం పడుతున్నది. వైద్య సేవలు పొందుతున్న రోగిని ఒక వార్డు నుంచి మరో వార్డుకు గాని, పారామెడికల్ సేవల కోసం గాని వార్డు దాటాల్సి వస్తే వార్డు ఇన్చార్జి వైద్య సేవల్లో అవగాహన ఉన్న సిబ్బంది పర్యవేక్షణలో పంపించాలనే కనీస నియమాన్ని పాటించాలి.
ఇందుకు భిన్నంగా ఒకే సిలిండర్‌తో వేర్వేరు కేసులకు సంబంధించిన ఇద్దరు చిన్నారులకు ఆక్సిజన్ సరఫరా అయ్యేలా తాత్కాలిక ఏర్పాటు చేశారు. రేడియాలజీ విభాగం, పారా మెడికల్ సేవల కోసం కు టుంబసభ్యులతోనే పంపించారు. సిలిండర్ నిర్వహణ, అనుభవం లేని ఇరు కు టుంబసభ్యులు ఇబ్బందులు పడుతూ రేడియాలజీ విభాగం, పారా మెడికల్ విభాగానికి తరలి వెళ్లారు. తిరిగి వార్డుకు చేరుకోవడానికి వెళ్తున్న క్రమంలో గుంతల మయం గా ఉన్న దారిలో ఒక శిశువుకు ఏర్పాటు చేసిన ఆక్సిజర్ పైప్ ఊడిపోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అప్రమత్తమై శిశువును వార్డుకు తరలించి ఆక్సిజన్ అందించారు. దీంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది.
వేర్వేరు విభాగాలకు వెళ్లాల్సిన ఇద్దరు చిన్నారులకు ఒకే సిలిండర్‌తో ఆక్సిజన్ ఏర్పాటు చేసి, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభు త్వం చిన్నారులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. పీడియాట్రిక్ వార్డులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్య తీసుకోవాలని రోగుల బంధువులు, అటెండెంట్లు కోరుతున్నారు.
హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ కిశోషోర్పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను విధుల నుంచి తప్పిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.