మెట్పల్లి రూరల్, డిసెంబర్ 13: తొలి విడత ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ తమ పార్టీ అంటే తమ పార్టీ అని కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియాలో పోటాపోటీ పోస్టులు పెడుతున్న ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లిలో జరిగింది. మూడు రోజుల క్రితం మేడిపల్లి పంచాయతీ సర్పంచ్‌గా కడారి రాజేశ్ గెలిచాడు. రాజేశ్ తమ పార్టీకి చెందిన వాడని బీజేపీ నాయకులు చెబుతుండగా, రాజేశ్ తమ పార్టీలోనే చేరాడంటూ కాంగ్రెస్ నేత లు ప్రచారం చేయడం గమనార్హం. ఈ నెల 11న రాజేశ్ మేడిపల్లి సర్పంచ్‌గా గెలిచాక బీజేపీ నాయకులతో కలిసి సంబురాల్లో పాల్గొన్నాడు. శనివారం కోరుట్లలో జరిగిన బీజేపీ సమావేశానికి రాజేశ్ హాజరయ్యాడు.
సర్పంచ్‌గా గెలిచినందుకు అభినందిస్తూ ఆ పార్టీ నేతలు సన్మానించారు. అనంతరం రాజేశ్ బయటకు వెళ్లిన కొద్దిసేపటికే కాంగ్రెస్‌లో చేరినట్టు సోషల్ మీడియాలో ఫొటోలు విడుదలయ్యాయి. స్వ తంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజేశ్ కాం గ్రెస్‌లో చేరాడని, ఆ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి నర్సింగరావు కండువా క ప్పారంటూ పలువురు సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడంతో బీజేపీ నేతలు కంగుతిన్నారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి లేక ఆపార్టీ నేతలు సైతం రాజేశ్‌కు మద్దతు తెలుపడం వల్లే నర్సింగరావును మర్యాదపూర్వకంగా కలిశారని బీజేపీ నేతలు పేర్కొంటూ తమతో ఉన్న ఫొటోలను విడుదల చేశారు. ఇలా రెండు పార్టీల నేతలు తంటాలు పడటం చర్చనీయాంశమైంది.