దుగ్గొండి/రామాయంపేట, నవంబర్ 26 : దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడం.. సాగు కోసం చేసిన అప్పులు భారంగా మారడంతో వరంగల్, మెదక్ జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన హింగె శోభన్‌బాబు (48) మిర్చి, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. సుమారు 10 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం ఉద యం 6 గంటల సమయంలో మిర్చి తోట వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి, పెద్ద కుమార్తె రవళికి ఫొన్ చేసి చెప్పా డు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి శోభన్‌బాబును నర్సంపేటలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.
రామాయంపేటలో యువరైతు ..
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్కు చెందిన చాకలి దుర్గ్గోల్ల బాలేశ్ (28)కు రెండెకరాల భూమి ఉన్నది. అందులో బోరుబావులు తవ్వించినా చుక్కనీరు పడలేదు. వేసిన పంట వేసినట్టే ఎండి పోవడంతో తీవ్రంగా కలత చెందాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో దూలానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.