హైదరాబాద్, జూలై28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో వానలు కురవనున్నట్టు హైదారాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాజన్న-సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ప్రాంతాల్లో గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు అధికారులు రెడ్అలర్ట్ జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 8.49 సెం.మీ, ఆదిలాబాద్ అర్బన్‌లో 5.05 సెం.మీ, భూపాలపల్లిలో 4.52 సెం.మీ, మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో 4.34 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.