హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : సాంకేతికతను ఉపయోగించుకొంటూ మహిళలు భద్రంగా, ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలని డీజీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో ‘షీ ఎంపవర్మెంట్’ 5వ ఉమెన్ కాంక్లేవ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రెండు షీ షటిల్ బస్‌లను ప్రారంభించిన డీజీపీ మాట్లాడుతూ, సాంకేతికత ఉపయోగిస్తున్న తరుణంలో ఎదురయ్యే ఇబ్బందులను కూడా మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. వైద్యరంగంలో టెక్నాలజీ అద్బుతాలు సృష్టిస్తున్నదని తెలిపారు. దినచర్యలో భాగంగా మహిళలు ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని, తప్పకుండా ఆరోగ్య విషయాల్లో వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కాంటినెంటల్ దవాఖాన సీఎండీ గుర్నాథ్రెడ్డి సూచించారు.
రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో చాలా ముందున్నామని, ఇంకా మరింతగా దూసుకెళ్లాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డాటా, సాక్ష్యాధారాల ఆధారిత పోలీసింగ్‌పై దృష్టి పెట్టామని నల్లగొండ ఎస్పీ అపూర్వరావు పేర్కొన్నారు. 2015లో ఒక్క బస్తో ప్రారంభమైన షీ షటిల్స్ ప్రస్తుతం 17కు చేరుకున్నాయని ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మెడికోవర్ డాక్టర్ లక్ష్మి, స్రవంతి శివరామ్, పాయల్ కపూర్, శిప్రా గాంధీ, జీ అమూల్య, శంకరమ్మ, అనసూయ, సరళ, పుష్పావతి, సంగీతకు యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ బహుమతులు ప్రదానం చేశారు. షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో మొదటి, మూడు స్థానాల్లో నిలిచిన వారికి కూడా అవార్డులిచ్చారు. కార్యక్రమంలో డీసీపీ నిఖితా పంత్, డాక్టర్ రమాదేవి, సైబర్ నిపుణుడు అనిల్, పద్మ ప్రియ, స్వరాజ్ ప్రియదర్శి, ప్రత్యూష శర్మ, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.