మల్హర్/పలిమెల/కరీంనగర్ నెట్వర్క్, జూన్ 4: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులకు పెద్ద పెద్ద వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఇండ్లపై ఉన్న రేకుల పైకప్పులు ఎగిరిపడ్డాయి. పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన నేరేడుగొమ్మ మలహల్రావు (52) తన ఆయిల్ పామ్ తోట వద్దకు వెళ్లాడు. ఇంతలో ఈదురుగాలులకు ఒక్కసారిగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
రాత్రి కావస్తున్నా మలహల్రావు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తోట వద్దకు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. అలాగే పలిమెల మండలంలోని నీలంపల్లికి చెందిన వాసం పద్మ (45) మరికొందరు మహిళలతో కలిసి గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లింది. ఉరుములు, మెరుపులతో వాన పడుతుండటంతో ఇంటికి పరుగెత్తుకుంటూ వస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కొడుకులున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలుల వర్షానికి భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు గంటపాటు ఉరుములు, మెరుపులు రావడంతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. గోదావరిఖనిలోని పవర్హౌస్ కాలనీలో సింగరేణి క్వార్టర్(టీ2-213)పై భారీ వృక్షం పడి ఇల్లు ధ్వంసమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్లో రైతు కొలకాని రాజయ్య వ్యవసాయ పనులు ముగించుకొని పశువుల పాక ముందున్న చెట్టుకు ఎద్దును కట్టేశాడు. ఈదురుగాలుల వర్షానికి ఒకసారిగా చెట్టు విరిగి ఎద్దుపై పడటంతో అతడి కండ్ల ముందే మృత్యువాత పడింది. వీర్నపల్లి మండలం బాబాయిచెరువు తండాలో పిడుగుపడి భూక్యాజగన్కు చెందిన గడ్డివాము దగ్ధమై రూ.20 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లోని సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంతంలో భారీ మర్రి చెట్టు నేలకూలగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. సిరిసిల్ల పట్టణంలో సుమారు గంటకుపైగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.