హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): జపాన్‌కు చెందిన రెండు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. గోదాముల్లో ఆటోమేషన్‌కు అవసరమయ్యే యంత్రాలను తయారు చేసే దైఫుకు సంస్థ కొత్తగా తమ యూనిట్‌ను నెలకొల్పనుండగా.. నికోమాక్ తైకిషా సంస్థ తమ మూడో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. మొత్తంగా రూ.576 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్‌కు రానున్నాయి. ఈ రెండు సంస్థలు మంగళవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. నగర శివారులో రూ.450 కోట్లతో దైఫుకు ఇండియా మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పనున్నది. సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. ఏడాదిన్నరలోగా ఫ్యాక్టరీని ప్రారంభించాలని యోచిస్తున్నది. పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, దైఫుకు సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ గరిమెళ్ల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి, వాటిని పరస్పరం మార్చుకున్నారు.
నికోమాక్ తైకిషా క్లీన్రూమ్స్ మూడో పరిశ్రమ
నికోమాక్ తైకిషా క్లీన్రూమ్స్ సంస్థ రూ.126.22 కోట్లతో హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీ) ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. దీనిద్వారా 100 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనున్నది. హైదరాబాద్‌లోని ఐడీఏ బొల్లారంలో నికోమాక్ తైకిషాకు సంబంధించి రెండు పరిశ్రమలు ఇప్పటికే కొనసాగుతుండగా, తాజాగా ఇది మూడవది కావడం విశేషం. భారతీయ అవసరాలను తీర్చిడంతోపాటు విదేశాలకు కూడా ఇక్కడినుంచే ఎగుమతి చేసేందుకు తెలంగాణను ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా మలుచుకోవాలని కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. పరిశ్రమ కోసం టీఎస్ఐఐసీ చందన్వెల్లిలో ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ కొత్త తయారీ కేంద్రం నుంచి భారతీయ, జపాన్, ఆసియా మార్కెట్లకు ఉత్పత్తులు సరఫరా చేయనున్నారు.
హైటెక్.. స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి: కేటీఆర్
ఉత్పత్తి సంస్థలు కేవలం ప్రాథమిక స్థాయి తయారీపైనే దృష్టిపెట్టకుండా హైటెక్, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు. కరోనా తర్వాత రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషదాయకమని అన్నారు. ప్రత్యేకించి తయారీరంగంలో అనేక మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. కరోనా, లాక్డౌన్లతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ (సప్లయ్ చైన్) అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని, చైనా మీద ఆధారపడ్డ దేశాలు ఇబ్బందులు చవిచూశాయని అన్నారు. ప్రతి దానికి చైనామీద ఆధారపడటం ఎందుకన్న ఆలోచనతో అన్ని దేశాలు పెద్ద ఎత్తున మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. చైనాతో పొల్చితే మన దేశంలో ప్రజాస్వామ్యం.. అతిపెద్ద మార్కెట్.. అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయని అన్నారు. భారతదేశం మొత్తాన్ని ఒకే గాటన కట్టకుండా.. ఆయా రాష్ర్టాల పారిశ్రామిక, పరిపాలన విధానాలను పారిశ్రామికవేత్తలు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
మన దేశానికి చెందిన పెట్టుబడిదారులు కేవలం మన దేశ అవసరాల కోసం కాకుండా ప్రపంచానికి సరిపడా ఉత్పత్తులను తయారుచేయాల్సిన అవసరముందని అన్నారు. ‘మాన్యుఫాక్చరింగ్ రంగంలో జపాన్ ప్రపంచానికి ఆదర్శం. జపాన్‌లో తయారీరంగ సంస్కృతి అద్భుతం. మనం వాడే సోనీ టెలివిజన్, పానాసోనిక్ ఏసీ, టయోటా కారు, శ్యామ్‌సంగ్ మొబైల్, ఎల్జీ రిఫ్రిజిరేటర్ ఇలా ప్రధాన వస్తువులన్నింటినీ జపాన్ తయారుచేస్తున్నది. మనం ఇలాంటి వస్తువులను ఎందుకు తయారుచేసుకోలేకపోతున్నామని ఆలోచించాలి. కొరియా సైతం అనేక ఉత్తమ పద్ధతులను అనుసరిస్తున్నది. మన దేశంలో విద్యావిధానం మారాలి. పాఠశాల దశలోనే డిజైన్ థింకింగ్‌ను ప్రవేశపెట్టాలి. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు మారాలి. థింక్ బిగ్ అన్నట్టుగా ఉన్నతంగా గొప్పగా ఆలోచించాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలు బాసర ట్రిపుల్ఐటీ వంటి విద్యాసంస్థలతో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తిచేశారు.
జెన్సీఫర్ లార్సన్ ఆసక్తికర ప్రశ్నలు
ఇక్కడికొచ్చే ముందు తాను యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్సీఫర్ లార్సన్‌తో సమావేశమయ్యానని కేటీఆర్ తెలిపారు. ‘పరిశ్రమశాఖ మంత్రిగా తయారీరంగం, ప్రాథమిక రంగం, సేవలరంగంపై మీరేమనుకుంటున్నారు? ఆయా అంశాలపై మీ రాష్ట్రం యోచన ఏమిటి? రాబోయే సంవత్సరాలు.. దశాబ్దాల్లో ఏం మార్పులు తీసుకురాబోతున్నారు? అంటూ లార్సన్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. తాను పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఎవరిని కలిసినా.. ఎక్కడ కలిసినా వారు మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు కొత్త ఉత్సాహాన్ని చూపిస్తున్నారని, మనం ప్రపంచంలోని ఉత్తమమైన విధానాలను బెస్ట్ ప్రాక్టీసెస్‌ను ఎంచుకోవాలని చెప్పాను. భారత దేశానికి సొంతంగా ఎదిగేందుకు ఆవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. ఈ అవకాశాలను కోల్పోరాదని, ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డాను. చైనా వెలుపల కంపెనీలు నెలకొల్పాలనుకునే ప్రపంచస్థాయి సంస్థలకు భారతదేశం మాత్రమే ఏకైక ప్రదేశంగా కనిపిస్తున్నది. మన దేశం దీనిని అందిపుచ్చుకోవాలంటే గత 30 ఏండ్లల్లో అమెరికా చేసిన పనిని వచ్చే పదేండ్లల్లో మనం చేయాలి. గత 25 సంవత్సరాల్లో చైనా చేసిన పనని మన రాబోయే 10ఏండ్ల కాలంలో చేయాలని చెప్పాను’ అని వివరించారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఐఎఫ్ఎస్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టిఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జపాన్‌కు చెందిన రెండు ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టడం ఆనందంగా ఉన్నది. ప్రముఖ లాజిస్టిక్స్ ఆటొమేషన్ సంస్థ దైఫుకు రూ. 450 కోట్లతో, నికోమాక్ తైకిషా క్లీన్రూమ్స్ రూ. 126 కోట్లతో పరిశ్రమలు నెలకొల్పనున్నాయి. దైఫుకు సంస్థలో 800 మందికి ఉపాధి లభించనుంది.
– మంత్రి కేటీఆర్
రెండు వారాల్లోనే ఎంవోయూ
‘మేం పరిశ్రమను స్థాపించాలని ప్రభుత్వాన్ని సంప్రదించగా సానుకూలంగా అత్యంత వేగంగా స్పందించి రెండు వారాల్లోనే ఎంఓయూ కుదుర్చుకునే వాతావరణాన్ని కల్పించారు. స్థలాలు ఎక్కడెక్కడున్నాయో చూపించి చందనవెల్లిలో స్థలం కేటాయించారు. క్రియాశీల, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలను ప్రభుత్వం అనుసరిస్తున్నది. మేము వేర్‌హౌజింగ్ సంస్థల్లో ఆటోమేషన్‌కు అవసరయ్యే యంత్రసామాగ్రిని తయారుచేస్తాం. రాబోయే రోజుల్లో 250కిపైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. వ్యాపారం స్థిరంగా కొనసాగితే మరో 800 ఉద్యోగులను నియమించుకునే అవకాశముంది. తెలంగాణలో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ ఆధారంగా భారత్‌లో ఉత్పత్తుల తయారీని వేగవంతం చేస్తాం.
– శ్రీనివాస్ గరిమెళ్ల, దైఫుకు సంస్థ ప్రతినిధి